సహజంగా రాజకీయ నాయకులు అంటే ప్రజలను గందరగోళంలోకి నెట్టడంలో సిద్ధహస్తులనే భావన ఉంది. అయితే అందరు రాజకీయ నాయకులూ ఇలా ఉండరు.
కొందరు ప్రజలను గందరగోళంలోకి నెట్టడానికి బదులు తమ రాజకీయ జీవితాలను తామే గందర గోళంలోకి నెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఓ రాజకీయ నాయకుడు ఆ పార్టీ నుంచి పోతాడా? అంటే పోడు…
ఉంటాడా? అంటే ఉండడు.. పోని ఊరుకుంటాడా? అంటే ఊరుకోడు… ఈయనెవరో ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉండాలి. ఒకవేళ కాకపోతే ఇక చదవండి.
కేశినేని నాని.. తెలుగుదేశం పార్టీ నాయకుడు.. గత రెండు టర్మ్‌లుగా విజయవాడ ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించారు.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు ట్రావెల్స్‌తో సహా పలు వ్యాపారాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల ట్రావెల్స్ వ్యాపారానికి స్వస్తి పలికారు.
విజయవాడ ఎంపీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. ముఖ్యంగా టాటా సంస్థ సహకారంతో ఎక్కువగా పనులు నిర్వహించడం ఈయనకు ప్లస్ అయింది.
2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ రెండవ పర్యాయం ఎంపీ అయిన దగ్గర నుంచి ఆయన ధోరణిలో విపరీతమైన మార్పు వచ్చింది. మాటి మాటికి పార్టీమీద అలగడం..
లోకేష్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేయడం. ఆనక మళ్లీ పార్టీ కార్యలపాల్లో పాల్గొనడం నిత్యకృత్యం అయిపోయింది. ఇలా తన రాజకీయ జీవితాన్ని తానే గందరగోళంగా మార్చుకున్నారు.
ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఆయన సోదరుడైన కేశినేని చిన్నిని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఈ విషయం నానీకి మింగుడు పడలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎప్పటికప్పుడు ఏదో ఒక రగడ జరుగుతూనే ఉంది.
తాజాగా కేశినేని నాని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తన అవసరం లేదన్నట్టు మాట్లాడారని, ఈ విషయాన్ని పార్టీకి చెందిన కొందరు పెద్దలు తనతో చెప్పారని,
ఇక నా అవసరం లేనిచోట నేను ఉండడం దండగ. కాబట్టి వచ్చే ఎన్నికల్లో నేను మరో ఫ్లాట్‌ఫాం నుంచి ఎంపీ బరిలో ఉంటాను. 2024లో విజయవాడ ఎంపీగా గెలిచేది కూడా నేనే..
అంటూ పార్టీకి తాను దూరం అవుతున్నట్లు అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పేశారు. నిత్యం వివాదాలతో విసిగిస్తున్న కేశినేని నాని ఎప్పుడు పార్టీ నుంచి పోతాడా అని చంద్రబాబు కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
నాని పోకతో ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పి తగ్గుతుంతో.. పెరుగుతుందో చూడాలి.