2023లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి ఓటమి చెందిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ నాయకత్వ వైఖరిలో మార్పు కనిపించడం లేదన్నది నగ్నసత్యం.
ఏ ఎన్నికల్లో అయినా అధికారంలో ఉన్నవారు.. అందునా 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నవారు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండటం సహజం. ఆదే వారి కొంప ముంచుతుంది.
సరే జరగాల్సిన నష్టం ఎలాగూ జరిగింది.. ఇప్పుడు దానికి గల కారణాలను అన్వేషించి వాస్తవ దృక్ఫధంతో ముందుకు వెళ్లడం ఏ పార్టీ అయినా చేసే పని.
కానీ బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ఈ విషయంలో ఊరందరిదీ ఒకదారి అయితే.. ఉలిపిగట్టుది మరోదారి అన్నట్టు వ్యవహరిస్తున్నారు.. వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్నికల ఫలితాలు రాగానే లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళతాం అన్న ఆయన అసలు ఆ లోపాల్ని కనుక్కోవడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదన్నది ఆయన వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది.
నిన్నటికి నిన్న ‘‘కేసీఆర్ 32 అభివృద్ధి పథకాలు, పనులు చేసేకంటే.. 32 యూట్యూబ్ ఛానల్స్‌ను పెట్టి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి’’ అంటూ వ్యాఖ్యానించాడు. అంటే..
ఆఫ్ట్రాల్ 5 నిముషాల్లో క్రియేట్ చేసే యూట్యూబ్ ఛానల్స్‌లో చేసిన ప్రాపగాండకే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుప్పకూలి ఉంటే..
ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వం ఎంత దారుణమైన స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ వ్యాఖ్యలు కేటీఆర్ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తున్నాయి.
అలాగే నిన్నటికి నిన్న బీఆర్‌ఎస్ శ్రేణులతో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ‘‘మనం అప్రమత్తంగా లేకపోతే పార్టీలు ‘తెలంగాణ’ పదాన్ని మాయం చేసే అవకాశం ఉంది’’ అంటూ నీతులు చెప్పారు.
తనకు మంత్రి పదవి ఇవ్వలేదని 2001లో తెలంగాణ రాష్ట్రసమితిని స్థాపించిన కేసీఆర్ అదే తెలంగాణ సెంటిమెంట్‌తో వివిధ వర్గాలు సాగించిన పోరాటాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని,
ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుని రెండోసారి కూడా తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఏకంగా దేశాన్ని ఏలాలనే అత్యాశతో
తెలంగాణ రాష్ట్రసమితిలో తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చి బొక్క బోర్లా పడిన సంగతి ప్రజలు గమనించలేదు అనుకుంటే అంతకు మించిన అహంకారం మరోటి ఉండదు.
తాజాగా ఎన్నికల్లో కేసీఆర్ అండ్ కోను ప్రజలు ఓడిరచింది కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అహంకారాన్ని భరించలేకే అనేది బహిరంగమే.
ఇలా ‘తెలంగాణ’ అనే పదాన్ని వాడుకుని రాష్ట్రాన్ని ఏలి, ఏకంగా అదే పదాన్ని పక్కన పడేసిన కేటీఆర్ గారు… వారి చేతిలో అధికారం లేకపోతే వేరెవరో తెలంగాణ అనే పదాన్నే లేకుండా చేస్తారని చెప్పటం గురివింద గింజ సామెతను గుర్తుకు తెస్తుంది.