ఈ రిటైర్డ్ పొలిటీషియన్స్‌తో పెద్ద చిక్కేనబ్బా.. అపారమైన రాజకీయ పరిణితి ఉన్న వీరు అడిగినా.. అడగక పోయినా యువ రాజకీయ నాయకులకు ఉచిత సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
ఆ సలహాలు, సూచనలు వారు తీసుకున్నారా? లేదా? అన్నది వారికి పట్టింపు లేదు. సలహాలు ఇచ్చి ఊరుకుంటారా అంటే.. ససేమిరా ఊరుకోరు. ఏదో రూపంలో మీడియాకు లీక్ చేస్తుంటారు.
ఇక అంతే అది కాస్తా రెండు, మూడు రోజులు మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. దీనివల్ల ఆ ట్రెండీ నాయకుడికి గానీ, పార్టీకి గానీ నష్టం జరుగుతుందో.. లాభం జరుగుతోందో చెప్పలేం.
ఈ రిటైర్డ్ కోవకు చెందిన నాయకులు చేగొండి హరిరామ జోగయ్య. సుధీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉంటూ, మంత్రి పదవులు కూడా నిర్వహించిన ఆయన కాపు సామాజిక వర్గంలో కూడా మంచి పేరున్న నేత.
ఇటీవల అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాకు మంచి స్టఫ్ అందిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు పరోక్ష మద్దతుగా ఆయన వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఆయన పవన్ కల్యాణ్‌ను కలిశారు. అనంతరం ఆయన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. అందులో ఆయన పవన్‌తో తాను జరిపిన భేటీలో చర్చకు వచ్చిన అంశాలను పేర్కొన్నారు.
ఇందులో ఆయన గత ఎన్నికల్లో జనసేనకు 10 వేల ఓట్లు వచ్చిన నియోజకవర్గాల లిస్ట్‌ను పవన్‌కు అందజేశానని, అందులో ఉన్న సమాచారాన్ని బట్టి పవన్ జనసేనకు 60 సీట్లను కోరవచ్చని చెప్పానని, పవన్ మాత్రం తనకు చెవిలో 40 సీట్లు అడుగుతున్నట్లు చెప్పారని అన్నారు.
అంతే కాదు పొత్తులో భాగంగా 2 సంవత్సరాలు సీఎం పదవిని షేర్ చేసుకోవాలని కూడా తాను సూచించినట్లు జోగయ్య లేఖలో వెల్లడిరచారు. దీనికి పవన్ బీజేపీ కూడా కూటమిలోకి వస్తోందని, అప్పుడే అన్ని విషయాలకు స్పష్టత వస్తుందని చెప్పారట.
ఓ వైపు పొత్తులో భాగంగా తమకున్న బలాన్ని బట్టే పట్టు విడుపులు ఉంటాయని పవన్ ఆ మధ్య బహిరంగ సభలోనే చెప్పుకొచ్చారు. కానీ జోగయ్య లేఖలో వివరించిన అంశాలను పరిశీలిస్తే..
టీడీపీ, జనసేనల మధ్య అనవసరపు ప్రతిష్ఠకు పోయేలా వ్యవహారం సాగే అవకాశం ఉందనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలన్న జోగయ్య ఆశ తప్పులేదు.
లక్షలాదిమంది పవన్ అభిమానులు కూడా ఆయన్ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. కానీ రాజకీయాల్లో వాస్తవికతకు పెద్ద పీట ఉంటుంది కాబట్టి జోగయ్య కొంత సంయమనం పాటిస్తే మంచిది అని జనసేన వర్గాలే అంటుండటం విశేషం.