తెరమీద మనకు కనపడే సినిమాల్లో అనేక చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి మనం అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తుంటాము. అలాగే తెర వెనుక కూడా అనేక విచిత్రాలు జరుగుతాయి.
వాటిని తర్వాత ఏ పత్రికలోనూ టీవీలోనూ వచ్చే ప్రోగ్రామ్స్ ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోతుంటాము. అలాంటి ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి దర్శకుడు బి. గోపాల్‌ను దర్శకుణ్ణి చేసింది.
ఇందుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ కారణమయ్యారు సీనియర్ నటి శారద, పరుచూరి సోదరులు. అప్పటికి బి. గోపాల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో`డైరెక్టర్‌గా తనను తాను నిరూపించుకున్నారు. రామానాయుడు గారికి బి. గోపాల్ అంటే చాలా ఇష్టం.
ఓరోజు ఆయన గోపాల్‌ను పిలిచి.. ‘‘నిన్ను నేనే డైరెక్టర్‌ను చెయ్యాలను కుంటున్నానయ్యా. మంచి సబ్జెక్ట్ తెచ్చుకో’’ అన్నారు. ఇంకేముందు గోపాల్ గారి ఆనందానికి అంతే లేదు.
ఆయనకు దైవ సమానులవంటి వ్యక్తులు పరుచూరి సోదరులు. వెంటనే వాళ్ల దగ్గర వాలిపోయారు. విషయం చెప్పారు. వాళ్లు కొన్ని లైన్‌లు చెప్పారు.
గోపాల్‌కు నచ్చితే నాయుడు గారికి నచ్చడంలేదు. నాయుడు గారికి నచ్చిన లైన్ గోపాల్‌కు నచ్చడం లేదు. చూసి చూసి నాయుడు గారు గోపాల్‌తో ‘‘సరైన లైన్ దొరికినప్పుడే చేద్దాం.
నెక్ట్స్ చేద్దామనుకున్న సినిమా డిలే అవుతోంది’’ అన్నారు. అంతే గోపాల్ ఆశలన్నీ నీరుగారి పోయాయి. విషయం పరుచూరి సోదరులకు చెప్పి బాధపడ్డారు వెంటనే పరుచూరి గోపాలకృష్ణ ‘‘శారద గారి దగ్గర ఒక మంచి కథ ఉంది. మేమే చేశాం.
కానీ ఆమె స్వంతంగా చేయాలనుకుని రాయించుకున్నారు. వెళ్లి అడిగి చూడు. నీ అదృష్టం బాగుంటే ఇవ్వొచ్చు అన్నారు. వెంటనే గోపాల్ ఆమె ఇంటి ముందు ప్రత్యక్షం అయ్యారు.
ముందు ఆమె ససేమిరా ఇవ్వను అన్నప్పటికీ గోపాల్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడం,
గోపాల్ టాలెంట్ శారద గారికి కూడా ఆల్రెడీ తెలిసి ఉండడంతో ఇక కాదనలేక ఆమె ఆ సబ్జెక్ట్‌ను ఇచ్చేశారు. అదే శారద, అర్జున్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రతిధ్వని’ సినిమా. 1986లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది