కేసీఆర్ ఆధ్వర్యంలోని గత బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్) ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణలో తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది.
తెలంగాణను బంగారు తెలంగాణగా చేస్తాం.. ప్రతి ఎకరాకూ నీటిని పారిస్తాం… దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారుతుంది అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్భాటంగా ప్రకటించిన కేసీఆర్.. ఈ మేరకు లక్షల కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా అనేక పంపుహౌస్‌లు, బరాజ్‌లు, భారీ నీటి నిల్వ ట్యాంకులు, సుదూరమైన కాల్వలను తవ్వారు.
అయితే మొదటి నుంచి అటు ప్రతిపక్షాలు, ఇటు మేధావి వర్గం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూనే వచ్చాయి.
భవిష్యత్తులు ఇది తెలంగాణకు గుదిబండగా మారుతుందని, ప్రాజెక్ట్‌కు అయ్యే ఖర్చును పక్కన పెడితే ఈ ఎత్తిపోతలకు వాడే బాహుబలి మోటార్లకు అయ్యే విద్యుత్ ఖర్చే సంవత్సరానికి వేల కోట్ల రూపాయల్లో ఉంటుందని, దీనివల్ల ప్రతి ఎకరాపై అదనపు భారం పడుతుంది తప్ప.. ఉపయోగం లేదని చెపుతూ వచ్చారు.
అయినా కేసీఆర్ ఛస్… మీరంతా తెలంగాణ ద్రోహులు.. తెలంగాణ రైతులు బాగుపడటం మీకు ఇష్టం లేదు.. బంగారు తెలంగాణ అంటే మీరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు అంటూ ఒంటికాలపై లేచారు. ఆనక తాను అనుకున్న విధంగా పనులు చేపట్టారు.
ఇందులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్ బీటలు వారడం ప్రారంభించింది. ఎన్నికలకు రెండు నెలల ముందు ఏకంగా కొన్ని పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ఉన్నతస్థాయి కమిటీని వేసింది.
తాజాగా ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మేడిగడ్డ మొత్తం నిరపయోగమేనని, కుంగిన పిల్లర్ల దగ్గర మరమ్మత్తులు చేపట్టినా ఉపయోగం లేదని, చాలా చోట్ల ప్రాజెక్ట్ దెబ్బతిన్నదని, ఈ బ్యారేజీకి చేసిన 3,625 కోట్లలో దాదాపు 3,200 కోట్ల రూపాయలు వృధాయేనని తేల్చింది.
అంతే కాదు. ఈ నాసిరకం నిర్మాణం, దీని వెనకాల ఉన్న అవినీతిలో 32 మంది అధికారుల పాత్ర ఉందని కూడా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పేర్కొంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఆ ప్రాజెక్ట్ భవితవ్యం ఆధారపడి ఉంది.