బీఆర్‌ఎస్‌కు బొంద పెట్టండి… కేటీఆర్‌తో కేడర్‌

0
212
ktr trs

అనుకున్నామని జరగవు అన్నీ… అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికని.. అనుకోవడమే పార్టీల పని.. పాడుకోవాల్సి వచ్చింది బీఆర్‌ఎస్‌ కేడర్‌ పరిస్థితి. తమ ప్రాంతాన్ని తామే పాలించుకుంటామని, మా నిధులు, నీళ్లు, నియామకాలు మేమే చేసుకుంటామని, చూసుకుంటామని ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో 1960ల్లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం మెల్లి మెల్లిగా 1969లో తీవ్రస్థాయికి చేరుకుంది.

అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. ఈ సందర్భంగా జరిగిన పోలీస్‌ కాల్పులో అనేకమంది మరణించారు కూడా. ఆ తర్వాత చాలాకాలం ప్రత్యేక తెలంగాణ కోసం తీవ్రస్థాయిలో ఏ ఉద్యమం పురుడు పోసుకోలేదు.

కానీ మధ్య మధ్యలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలోనే తెలంగాణ వాదులు కొందరు ప్రభుత్వంతో తెలంగాణ కార్డు అడ్డం పెట్టుకుని అనుకున్నవి సాధించుకునేవారు.

ktr trs

ఈ క్రమంలోనే 2001లో తెలుగుదేశం పార్టీలో మంత్రిపదవి దక్కక పోవడంతో అలక వహించిన కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మళ్లీ పురుడు పోశారు. ఈసారి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అంటూ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అసలైన వేదికను పార్టీ పేరులోనే పెట్టుకుని ప్రజల ముందుకు వచ్చారు.

అప్పటికే చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్టుగా ఉన్న తెలంగాణ వాదులందరూ ఈ వేదిక మీదకు వచ్చారు. అలా ప్రారంభమైన ఉద్యమం అన్ని వర్గాలను కలుపుకుని ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకూ పోరాడి సాధించుకుంది.
ప్రత్యేక తెలంగాణలో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌కు అధికారం మత్తు విపరీతంగా సోకింది.

దీంతో కొడుకును ముఖ్యమంత్రిని చేసి, తాను ప్రధాని కావాలనే దురాశతో తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్తా భారత రాష్ట్రసమితిగా మార్చి దేశమంతటా విస్తరించాలని కలలుగన్నారు. తానోకటి తలిస్తే… దైవం మరొకటి తలచినట్లుగా గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరించారు. చేసేదిలేక కేసీఆర్‌ ఇంటికే పరిమితం అయ్యారు.

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించటానికి గాను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా చాలా మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడమే పెద్ద తప్పు అని.. పార్టీ పేరులోంచి తెలంగాణ అన్న పదం తీసేయడం క్షేత్రస్థాయిలో ప్రజల్లో తీవ్రమైన అసహనానికి కారణమైందని, ఈ తప్పు దిద్దుకుని బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారిస్తే కొంత అవకాశం ఉంటుందని గట్టిగా చెప్పారట.

దీంతో కేటీఆర్‌కు ఏం చెప్పాలో తోచక పెద్దాయనతో మాట్లాడతానని ముక్తసరిగా జవాబు ఇస్తున్నారట.