ఎన్ని సీట్లు తీసుకోవాలో నాకు తెలుసన్న పవన్‌

0
310
pawan kalyan

ఏప్రిల్‌ నెలలో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏపీలో వాటితో పాటు సాధారణ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇటీవల ఎన్నికల కమీషన్‌ స్టేట్‌మెంట్‌లతో ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. దీంతో ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌తో రాజుకున్న ఎన్నికల వేడి మరింత సెగలు కక్కుతోంది.

అన్ని రాజకీయ పార్టీలు కురుక్షేత్ర సమరానికి సన్నద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన కూటమి కూడా తనదైన శైలిలో ఉమ్మడి శత్రువు వైసీపీ ఓటమికి కృషి చేస్తున్నాయి.

గణతంత్ర దినోత్సవంలో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

pawan kalyan

రాబోయే ఎన్నికల్లో టీడీపీతో తాము ఏర్పరచుకున్న పొత్తును ఇబ్బంది పెట్టేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని, దయచేసి అలాంటివి చేయవద్దని, అన్ని విషయాలు తాను చూసుకుంటానని, పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసని ఘాటుగా మాట్లాడారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. సీఎం పదవి. సీట్లపై ఎవరూ ఆందోళన చెంద వద్దు. జగన్‌ ప్రభుత్వం 2024లో మళ్లీ అధికారంలోకి రాకూడదు. జగన్‌కు ఊరంతా శత్రువులే. జగన్‌పై నాకు వ్యక్తిగత కక్ష లేదు. స్వంత చెల్లినే వదలని జగన్‌ మనల్ని వదులుతాడా. టీడీపీతో పాటు మనపై కూడా అతను దాడి చేస్తున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది. రాజకీయాల్లో కొన్ని ఆటుపోట్లు ఎదురౌెతాయి. కొన్నిసార్లు తప్పవు. వాటిని సీరియస్‌గా తీసుకోవద్దు. అందరూ నన్ను అర్ధం చేసుకుంటారని భావిస్తున్నా. అసెంబ్లీ ఎన్నికలతోనే మనం ఆగిపోవడం లేదు.

ఐదేళ్ల పోరాటం 2024లో రాజకీయ పోరాటం కావాలి. సీట్ల విషయంలో చంద్రబాబుకు ఒత్తిడి ఉంటుంది. అలాగే నాపైన కూడా ఒత్తిడి ఉంటుంది. ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు సాధించగలం అంతే.. అధికారంలోకి రాలేం. వైసీపీ వాళ్లకు కష్టం వచ్చినా నా దగ్గరకే రావాలి.

పొత్తుకు ఇబ్బందులు సృష్టించేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి మానేయండి. ఎన్ని సీట్లు తీసుకోవాలో నాకు తెలుసు అన్నారు. పవన్‌ తన ప్రసంగంలో ఇటీవల జనసేన పొత్తులో భాగంగా తీసుకోవాల్సిన సీట్లపై చేగొండి హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.