స్వయంకృషికి ‘పద్మ విభూషణం’

0
678
swayakrushi

మెగాస్టార్‌ చిరంజీవి.. నిన్నటి వరకూ ‘పద్మ భూషణ్‌’డు.. నేటి నుంచీ ‘పద్మ విభూషణ్‌’డు. కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా మొదలైన ఆ ప్రస్థానం ‘పద్మ విభూషణ్‌’ స్థాయికి రావడం వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరో తెలుసా?.. ఖచ్చితంగా 100కి 100 శాతం ఆయన ‘స్వయం కృషి’.

గుంపులో గోవింద పాత్రల నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, హీరోగా, స్టార్‌ హీరోగా, సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా తనని తాను మలుచుకోవటానికి క్షణ క్షణం పడిన తపన, చేసిన కృషి చిరంజీవిని ఈ స్థాయికి చేర్చింది.

కెరీర్‌ ప్రారంభం నుంచి చిరంజీవిది కష్టాన్ని ఇష్టంగా ప్రేమించే తత్వమే. సాధారణ స్థాయి పాత్రల్లో నటిస్తున్న తాను స్టార్‌ హీరో కావాలంటే ఏం చేయాలనే ఆలోచన మొదలైన రోజు నుంచీ ఫైట్స్‌, డాన్స్‌లు, నటన వంటి విషయాలపై ఎంతగా దృష్టి పెట్టారో.. అదే సమయంలో తోటి నటీనటులు, టెక్నీషియన్స్‌తో ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి.

swayakrushi

అప్పటికే పరిశ్రమలో ఉన్న పెద్దలతో ఎలా మర్యాదగా నడుచుకోవాలి.. తన దర్శక, నిర్మాతలను ఎలా గౌరవించుకోవాలి అనేవి కూడా నేర్చుకున్నారు. సినిమా రంగంలో తొలి ప్రాధాన్యం డబ్బుదే అయినా.. ఒక స్థాయి దాటిన తర్వాత అది సైలెంట్‌గా వెనక్కు వెళ్లిపోతుంది.

దాని స్థానంలోకి వినయం, విధేయత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం.. నలుగురికి సాయం చేసే గుణం ముందుకు వస్తాయి. వీటి విషయంలో చిరంజీవి మీట వేసి కొలిచినట్టు చక్కగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ వచ్చారు. ఈ గుణ, గణాలే చిరంజీవిని తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు పరుగులు నేర్పించిన కలెక్షన్‌ల వేటగాడుని చేశాయి.

తనను ఇంత వాణ్ణి చేసిన ప్రేక్షకుల, అభిమానుల రుణం తీర్చుకోవటానికి ‘చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ పేరుతో తన పేరుమీదే ఒక ఛారిటబుల్‌ ట్రస్ట్‌ స్థాపించిన తొలి హీరో చిరంజీవే. ఆ ట్రస్ట్‌ ద్వారా రక్తదానం చేసి, లక్షల మందితో రక్త సంబంధం, కళ్ల దానం ద్వారా సృష్టి బంధం ఏర్పరచుకున్న నిలువెత్తు మానవతామూర్తి చిరంజీవి.

అందుకే భారత ప్రభుత్వం 2006లో ‘పద్మ భూషణ్‌’తోను, 2024లో ‘పద్మ విభూషణ్‌’తోను సత్కరించింది. స్వయంకృషితో కోట్లాది మందికి ఆదర్శంగా మారిన చిరంజీవి మరెన్నో పురస్కారాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందలు చెపుతున్నాం.