బుద్ధిగా పనిచెయ్‌… కేటీఆర్‌కు సీతక్క వార్నింగ్‌

0
312
Sitakka

శీతాకాలంలో కూడా తెలంగాణ రాజకీయాలు హాట్‌ హాట్‌గానే సాగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష పాత్రలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ వాటిని తిప్పి కొడుతోంది.

రాజకీయాల్లో ఇది సహజమే అయినప్పటికీ.. ఉద్యమ ఆకాంక్షతో ఏర్పడిన ఒక రాష్ట్రం ఇంతకు మించిన పరిపక్వతను ఆశిస్తుంది అనడంలో సందేహం లేదు.

10 సంవత్సరాల తమ పాలనలో రాజ్యాంగం పట్ల, గానీ, కోర్టుల పట్ల గానీ, వ్యక్తులపట్ల, వ్యవస్థల పట్ల గౌరవం లేకుండా పాలన సాగించారనే చెడ్డపేరుతో అధికారం కోల్పోయారు. అనే విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పదే పదే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అన్నట్లు మాట్లాడటం ప్రభుత్వంలోని మంత్రులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

Sitakka

దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా బీఆర్‌ఎస్‌కు కౌంటర్‌ ఇచ్చారు.
తాజాగా పంచాయితీరాజ్‌, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ముందు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను మానుకుని బాధ్యతాయుత ప్రతిపక్షంగా పనిచేయడం నేర్చుకో అని కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

గురువారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రెండు ఇంగ్లీష్‌ ముక్కలు మాట్లాడితే అభివృద్ధి కాదు. 9 సంవత్సరాల పాటు తెలంగాణలో గడీల పాలన కొనసాగించిన మీకు ప్రజలు ఓటమి రుచిచూపించినా ఇంకా బుద్ధి రాలేదు.

ఇప్పటికీ కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక పోవడాన్ని బట్టి మీకు ప్రజాస్వామ్యం అంటే ఎంత గౌరవమో అర్ధం అవుతోంది. మీ అహంకారమే మీ ఓటమికి కారణమైంది. ఇంకా మీకు తెలిసిరావడం లేదు. సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు.

నాలుగు ఇంగ్లీష్‌ ముక్కలు నేర్చుకుని మాట్లాడితే అభివద్ధి కాదు. మీ ఇంగ్లీష్‌కి, అభివృద్ధికి సంబంధం ఏమైనా ఉందా?. బాధ్యతగల ప్రతిపక్షంగా వ్యవహరిస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. లేకపోతే ఎప్పటికీ తిరస్కరిస్తూనే ఉంటారు అన్నారు.