ఇటీవల బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితం, తన కూతురు క్లీంకార గురించి పంచుకున్న విషయాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
రామ్ చరణ్ తన కూతురు క్లీంకార రాకతో తన జీవితం ఎలా మారిపోయిందో చర్చించారు. క్లీంకార రాకతో ప్రతి రోజు ప్రత్యేకమైనదిగా మారిందని చెప్పారు. ఆ టైంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కొనసాగుతున్నప్పటికీ ఎక్కువ సమయం క్లీంకారతో గడిపానని చెప్పాడు. క్లీంకార తినే అలవాట్లు, తను చేసే అల్లరి గురించి చెబుతూ, తాను తినిపించకుండా క్లీంకార అన్నం తినదని హాస్యంగా చెప్పాడు. తాను తినిపించిన తర్వాతే తన పని పూర్తవుతుందని చెప్పారు.
క్లీంకార ప్రైవసీపై కూడా చరణ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. స్టార్ కిడ్ అనే ఒత్తిడి రాకూడదని, అందుకే ఇప్పటివరకు ఆమె ముఖం సోషల్ మీడియాలో రివీల్ చేయలేదని తెలిపారు. క్లీంకార “అమ్మా” అని పిలుస్తోందని, “నాన్నా” అని పిలిచే రోజు ఫేస్ రివీల్ చేస్తానని చెప్పారు.
ఈ షోలో చరణ్ తన చిన్నతనంలోని అనుభవాలను పంచుకున్నారు. తాను చిన్నప్పుడు ఎక్కువగా తన మామయ్య పవన్ కళ్యాణ్, నాగబాబుతో గడిపేవాడిని అన్నారు. హార్స్ రైడింగ్ వంటి ఎన్నో విషయాల్లో పవన్ కళ్యాణ్ తనకు సహాయం చేశారని తెలిపారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత రానా దగ్గుబాటి తో స్నేహం పెరిగిందని, తమ కుటుంబ బాధ్యతను అల్లు అరవింద్ చూసుకున్నారని వెల్లడించారు.
బాలయ్య మాత్రం చరణ్‌ను ప్రశ్నలతో ఇరికించడంలో ముందుండిపోయారు. అలియా భట్, కియారా అద్వానీ, సమంతల్లో ఎవరు బెస్ట్ యాక్టర్ అని అడిగినప్పుడు, సమంత మంచి వ్యక్తి అని రామ్ చరణ్ చెప్పారు. అయితే బాలయ్య వెంటనే “మంచి వ్యక్తి ఎవరు కాదు, బెస్ట్ యాక్టర్ ఎవరు?” అని చమత్కారం చేశారు. అందుకు రామ్ చరణ్ సమాధానంగా “సమంతే బెస్ట్ యాక్టర్, మా కుటుంబంతోనూ ఆమెకు మంచి సంబంధం ఉంది,” అని చెప్పారు.
ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రామ్ చరణ్ ఓ వ్యక్తిగా, తండ్రిగా తన జీవితం గురించి చెప్పిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.