
మలయాళ నటి హనీ రోజ్ ఫిర్యాదు చేసిన వేధింపుల కేసులో చిక్కుకున్న ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ కు ఇటీవల కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా, ఆయన జైలులోనే ఉండాలని నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆయన తమ న్యాయ బృందానికి ఇచ్చిన ప్రకటన ప్రకారం, జైలులో ఉన్న ఇతర ఖైదీల సమస్యలపై సంఘీభావం తెలిపేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జైలు నుంచి విడుదల కాకుండా, నిరసనగా ఆందోళన చేస్తున్న ఆయన చర్య మద్దతుదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైకోర్టు బెయిల్ ఆర్డర్ జారీ చేయగా, ఆయన న్యాయవాదులు బాండ్‌పై సంతకం చేయించాలని సూచించినప్పటికీ, చెమ్మనూర్ నిరాకరించారు. ఆయన నిర్ణయం వల్ల బెయిల్ షరతులు పూర్తి చేయలేకపోయారు. ఈ కారణంగా విడుదల ఆర్డర్ జైలులోనే నిలిచిపోయింది. సాంకేతిక కారణాల వల్ల విడుదల కాలేకపోయిన ఖైదీల సమస్య పరిష్కారం అయ్యేటంతవరకు వరకు తాను జైలు నుండి బయటకు రావడం లేదని చెమ్మనూర్ స్పష్టం చేశారు.
ఈ కేసుకు సంబంధించి నాలుగు నెలల క్రితం జరిగిన సంఘటనలో చెమ్మనూర్ తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని నటి హనీ రోజ్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో సైబర్ దాడులు ఎక్కువయ్యాయి. ఫిర్యాదు ఆధారంగా వయనాడ్ రిసార్ట్‌లో జనవరి 8న చెమ్మనూర్‌తో పాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ దాడులకి పాల్పడిన వ్యక్తులను కూడా గుర్తించి చర్యలు తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
హనీ రోజ్ ఫిర్యాదుపై కేరళ హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో చెమ్మనూర్ చేసిన బహిరంగ ప్రకటనలు కూడా పరిశీలించగా, అవి ఇతరులకు హాని కలిగించేవిగా ఉండటం నేరమని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి ప్రకటనలు మళ్లీ చేయొద్దని చెమ్మనూర్‌ను హెచ్చరించిన కోర్టు, కేసులో నిరంతర కస్టడీ అవసరం లేదని భావించి ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అయితే, చెమ్మనూర్ తన వ్యక్తిగత ఆందోళనతో పాటు జైలు సహఖైదీల సమస్యలపై దృష్టి పెట్టడం, తన నిర్ణయాన్ని సానుకూలంగా సమర్థించడం అతని సహనాన్ని చూపిస్తుంది. ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారినప్పటికీ, చట్టపరమైన అంశాలపై తదుపరి చర్యల కోసం కేరళ హైకోర్టు పరిశీలన కొనసాగుతుందని తెలుస్తోంది.