
టాలీవుడ్లో అనిల్ రావిపూడి ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా విజయవంతమవుతూనే ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి ఓటమిని ఎరుగని ఆయన, ప్రతి సినిమాను కుటుంబ ప్రేక్షకులు, యూత్‌కి నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. అందుకే అనిల్ రావిపూడి చిత్రాలు భారీ వసూళ్లు రాబడుతూ, మార్కెట్ పరంగా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తున్నాయి.
ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు. వెంకటేశ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించింది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఈ ఏడాది టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, అనిల్ రావిపూడి కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుండడం విశేషం.
వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు తన తదుపరి సినిమాకి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్. కెరీర్ ప్రారంభంలో ‘పటాస్’ చిత్రానికి కేవలం 2 కోట్లు పారితోషికంగా తీసుకున్న ఆయన, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాకి 25 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది చూసి అభిమానులు ఆయన ఎదుగుదలను ప్రశంసిస్తున్నారు. కష్టపడి పైకి వచ్చిన అనిల్ రావిపూడి, మరింత గొప్ప సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు.
అసలే ఫ్యామిలీ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసుకుని హిట్ చిత్రాలు అందిస్తున్న అనిల్ రావిపూడి, చిరంజీవితో కలిసి ఎలా అలరించబోతున్నారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. చిరంజీవి కామెడీ టైమింగ్, ఎమోషన్లను ఎలా హ్యాండిల్ చేస్తారోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలోనే కథ ఉంటుందని, అయితే కొన్ని మార్పులు చేసి మెగా అభిమానులను మెప్పించేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్లో బిజీగా ఉండగా, అనంతరం అనిల్ రావిపూడి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టనున్నారు.
ఇప్పటి వరకు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను మురిపించాయి. వినోదాన్ని ప్రధానంగా చూపిస్తూ, మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా కథలను అందించడంలో ఆయన దిట్ట. మెగాస్టార్‌తో ఆయన సినిమా ఎలా ఉండబోతుందన్న దానిపై అంచనాలు పెరిగిపోయాయి. అన్ని విషయాలు అనుకూలిస్తే, ఈ ప్రాజెక్ట్ కూడా భారీ విజయాన్ని సాధించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.