అందుకే అంటారు గ్రహచారం బాగోపోతే బంగారం పట్టుకుంటే మట్టిగడ్డ అయిందని.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్రెడ్డి పరిస్థితి అలాగే ఉంది.
2019 ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని దక్కించుకుని 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లతో దిగ్విజయాన్ని అందుకున్నప్పటికీ మళ్లీ ఎన్నికలు సమీపించే సరికి బేలచూపులు చూడాల్సిన పరిస్థితి ఆయనది.
పదుల సంఖ్యలో పెట్టుకున్న సలహాదార్లు, లక్షల సంఖ్యలో ఉన్న వాలటీర్లు అందరూ ఆయనకు నిష్ప్రయోజనంగానే కనిపిస్తున్నారు. దీనికి తోడు తన తప్పుడు నిర్ణయాల వల్ల రాజకీయంగా శత్రువులుగా ఉన్న వారందరూ ఉమ్మడి శత్రువుగా మారిన జగన్‌ను ఎదుర్కోవటానికి ఒక్కటౌతున్నారు.
ఆది నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీదే హవా. ఆ తర్వాత తెలుగుదేశం స్థాపనతో కాంగ్రెస్ తెలుగుదేశంల మధ్య రాజకీయ శత్రుత్వం పాతుకుపోయింది. దాదాపు నాలుగు దబ్దాలుగా ఈ శత్రుత్వం ఇలాగే కొనసాగుతూ వచ్చింది.
వీరి మధ్యలో కమ్యూనిస్ట్‌లు ఎలాగూ ఉన్నారనుకోండి. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ వైయస్సార్ సీపీని స్థాపించడంతో ప్రధాన శత్రుత్వం వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్‌లు వెనుక వరుసలో నిలిచారు.
ఆ తర్వాత పవన్ కల్యాణ్ జనసేన ప్రారంభించడంతో ఈ శత్రుత్వం వైసీపీ వర్సెస్ టీడీపీ వర్సెస్ జనసేన వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కమ్యునిస్ట్లుగా మారింది.
2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్‌లు ఒంటరిగా బరిలోకి దిగగా ప్రధాన యుద్ధం మాత్రం వైసీపీ, టీడీపీల మధ్యనే జరిగింది.
అయితే మారిన రాజకీయ ముఖ చిత్రం కారణంగా వైసీపీని ఎదుర్కోవటానికి ఒకరికొకరు శత్రువులుగా మారి గత ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ
(వీటికి తోడు కాంగ్రెస్ కూడా వీరితో కలిసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి)లు ఏకమై తమ ఉమ్మడి శత్రువు అయిన వైసీపీని ఓడిరచటానికి సిద్ధమౌతున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉమ్మడి శత్రువులను ఏకతాటిపైకి తెచ్చింది మాత్రం జగన్ పిచ్చి చేష్టలు, పదే పదే చేసిన పనికిమాలిన విమర్శలు అనే చెప్పాలి. పదే పదే చంద్రబాబు, పవన్‌లను దత్తపుత్రుడు దత్త పుత్రుడు అనడంతో విడిపోయిన వారి మైత్రి మళ్లీ కలిసినట్లు అయింది.
దీనికి తోడు తాను శత్రువుగా మార్చుకున్న స్వంత చెల్లి కాంగ్రెస్ పార్టీ తరపున ఈ కూటమికి సహకరించే ఆవకాశం కూడా మెండుగా ఉండటం జగన్ స్వయంకృపారాధమనే చెప్పాలి.