గ్రీన్ ఛానల్.. ట్రాఫిక్ విధుల్లో ఇదొక కీలకమైన అంశం. ఎవరైనా వీవీఐపీల రాకపోకలు సాగించినా, లేదా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ కేసులో అయినా దీన్ని అమలు చేస్తారు.
ఇందులో భాగంగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరే వరకూ సదరు వెహికల్‌కు గానీ, కాన్వాయ్‌కి గానీ గ్రీన్ ఛానల్ పేరిట ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తారు. ఈ సమయంలో ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ ఆపివేస్తారు.
ఇలాంటి ప్రొటోకాల్ రూల్ రాష్ట్ర గవర్నరుకు, ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు మాత్రమే ఉంటుంది. వీరి ప్రయాణం సుగమం చేయడానికి ఈరూల్‌ను పాటిస్తారు పోలీసులు.
ఇటీవల కాలంలో ప్రత్యేక పరిస్థితుల్లో హెల్త్ ఎమర్జెన్సీ కేసులకు సంబంధించిన వాహనాలను కూడా ఇందులో చేర్చారు. అంటే గుండె తరలింపు, ఇతర అవయవాల తరలింపు వంటివి.
వీరికి తప్ప మరెవరికీ గ్రీన్ ఛానల్ అనుమతి లేదు. వీరి తర్వాత వీఐపీలుగా భావించే వ్యక్తుల విషయంలో వారి వాహన శ్రేణి చేరుకున్న సిగ్నల్ వరకూ మాత్రమే సిగ్నల్ ఫ్రీగా మారుస్తారు.
అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్ది కాన్వాయ్‌కి కూడా ఈ గ్రీన్ ఛానల్‌ను అమలు చేస్తూ స్వామి భక్తిని చాటుకుంటున్నారట పోలీసులు. సహజంగా డీజీపీ కాన్వాయ్‌కి సిగ్నల్‌ఫ్రీ మాత్రమే వర్తిస్తుంది.
కానీ ఏపీ డీజీపీకి అనధికారికంగా గ్రీన్ ఛానల్ వర్తింప చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడలోని డీజీపీ బంగ్లా నుంచి మంగళగిరిలోని డీజీపీ ఆఫీస్ వరకూ ఆయన ప్రయాణించే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రీన్ ఛానల్ ప్రొటో కాల్ పాటిస్తున్నారు.
ఇటీవల డీజీపీ కాన్వాయ్ బెంజిసర్కిల్, హోటల్ వివంత వద్ద కొద్దిసేపు ఆగాల్సి వచ్చిందట. దీంతో ఆగ్రహించిన అధికారులు ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సీఐ, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారట.
ఆరోజు వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో అలా జరిగిందని వారు వివరణ ఇచ్చుకున్నా అధికారులు వినలేదట. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని మిగిలి ట్రాఫిక్ సిబ్బంది కూడా డీజీపీ కాన్వాయ్‌కి అనధికార ప్రొటోకాల్ పాటిస్తున్నారట.