విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబు అక్కడ 33 వేల ఎకరాలను సేకరించారు. అందులో తాత్కాలిక సచివాలయం, హైకోర్టు, ఇతర నిర్మాణాలు చేపట్టారు.
వీటిలో కొన్ని పూర్తయ్యాయి కూడా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిని ఎంత వీలైతే అంత తొక్కేయడానికే ప్రయత్నించాడన్నది వాస్తవం. నిండుసభలో అమరావతిని రాజధాని చేయడాన్ని మేం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అంటూ ప్రకటించారు.
ఆ తర్వాత ఆ మాట తప్పి మూడు రాజధానులు అంటూ కొత్త స్వరం అందుకున్నారు. దీనిపైన కూడా ఆయనకు, ఆయన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
ఇప్పటి వరకూ మూడు రాజధానుల విషయంలో సిన్సియర్‌గా చేసిన కృషి ఏంటంటే నోరెళ్లబెట్టాల్సిందే. లీగల్‌గా ఉన్న సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేశారు.
ఆనక అమరావతి అంశం కోర్టుకు ఎక్కింది. ఇక్క అక్కడి నుండి కోర్టు తీర్పు కోసం ఇటు ప్రభుత్వం, అటు అమరావతి రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఇలాంటి పరిస్థితిలో అమరావతికి సంబంధించి ఎటువంటి కొత్త చట్టాలు చేయటానికి వీలు లేదని హైకోర్టు తన రిట్ ఆఫ్ మాండమస్‌ను ప్రకటించింది.
ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. అది కూడా వెంటనే కాకుండా 6 నెలల తర్వాత. హైకోర్టు శాసన వ్యవస్థ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటోంది అంటూ సుప్రీంకు విన్నవించింది.
డిసెంబర్‌లోనే సుప్రీం ధర్మాసనం ముందుకు ఈ కేసు రావాల్సి ఉంది. కానీ రాలేదు. తాజాగా బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా..
జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ కేసును ఏప్రిల్ నెలకు వాయిదా వేసింది. దీంతో అమరావతి నుంచి అర్జంటుగా విశాఖ వెళ్లిపోదామనుకున్న జగన్ అండ్‌కోకు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
ఏప్రిల్ నెల అంటే ఈలోపు ఏపీలో ఎన్నికలు కూడా పూర్తవుతాయి. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కేసు విచారణ జరగవచ్చు.
అప్పటి వరకూ మాత్రం ప్రస్తుత జగన్ సర్కార్ అమరావతిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకునే వీలు లేదు.