రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఇది సత్యం కూడా. రాజకీయ అవసరాల కోసం దశాబ్దాలుగా తాను నమ్ముకున్న పార్టీకి గుడ్‌బై చెప్పి మరో పార్టీ పంచన చేరిపోవడానికి ఏ మాత్రం అలోచించట్లేదు ప్రస్తుత రాజకీయ నాయకులు. సీనియారిటీ పెరిగే కొద్దీ నాయకుల కోర్కెలు, కోరుకున్న హోదాలు కట్టబెట్టాంటే తంటాలు పడాల్సిందే. తమ సీనియారిటీని పట్టించుకోక పోయినా, తగిన గౌరవం దక్కక పోయినా పార్టీలకు ముందుగా నర్మగర్భ వ్యాఖ్యలతో, ఆనక సంచలన వ్యాఖ్యలతో వార్నింగ్‌లు పంపుతారు నాయకులు.
తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి నాటి యన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవిని పొందారు ఆనం. ఆనక కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుని మంత్రి పదవులు కూడా అనుభవించారు రామనారాయణ. ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి తన సంచలన చేష్టలతో, చర్యలతో ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
2014 ఎన్నిక అనంతరం మరల టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు ఆనం సోదరులు. సోదరుడు వివేకానందరెడ్డి మరణానంతరం క్రీయాశీలక రాజకీయాలకు కొన్ని రోజులు దూరంగా ఉండి పోయిన రామనారాయణ మళ్లీ 2018లో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జగన్ తొలి క్యాబినెట్లో బెర్త్ ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే జగన్ మాత్రం సీనియర్ నాయకులను కాదని జూనియర్లు అయిన అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డికు మంత్రి పదవు ఇచ్చారు. నాటి నుంచి ఆలక బూనిని ఆనం ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు.