భలే రాసుకున్నావు ‘సాక్షి’

0
396

ఈనాడు అప్రతిహత యాత్రకు అడ్డు నిలిచిన ‘సాక్షి’ ప్రారంభంలో ప్రజల పక్షానే నిలిచింది. గెలిచింది. రాను రాను అది కూడా ఈనాడు బాట పట్టింది. తన యజమానికి, ఆయన పార్టీకి సంబంధించిన వార్తలను హైలైట్‌ చేయడం ఒక్కటే సాక్షి ఎజెండా. మంచిదే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పేపర్‌ నడపడం వెనుక ఏదో ఒక స్వార్ధం లేకపోతే ఎలా. కానీ ఈ పైత్యం మరీ ఎక్కువైతే పాఠకుల్లో చుకనవ్వడం మాత్రం ఖాయం. ఇందుకు ఉదాహరణగా సాక్షిలో ఈరోజు వచ్చిన ఓ వార్తను పేర్కొనాలి.

జగన్‌ మోహన్‌రెడ్డి క్రైస్తవ మతస్తుడైనందున ఆయన తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వకుండా దర్శనానికి వెళ్లకూడదు అని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి కొద్ది నెల కిందట కోర్టు మెట్లెక్కాడు. కోర్టు సాక్ష్యాధారాను, వాదోపవాదాలను విన్న మీదట జగన్‌ వ్యక్తిగత హోదాలో తిరుమలకు వస్తే డిక్లరేషన్‌ ఇవ్వవచ్చు.. కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర నాయకుడిగా, టీటీడీ పాలకమండలి ఆహ్వానం మేరకు వచ్చారు కాబట్టి డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే రాజకీయ నాయకులు చర్చికు వెళ్తారు, మసీదుకు వెళ్తారు, గురుద్వారాకు వెళ్తారు.

దీన్ని పరిగణనలోకి తీసుకుని వారికి ఆ మతాలను ఆపాదించలేం అని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అత్యుత్సాహం ప్రదర్శించిన సాక్షి మాత్రం ‘‘ఓ వ్యక్తి బైబిల్‌లోని పేరు పెట్టుకున్నంత మాత్రాన, క్రైస్తవ ఉపన్యాసానికి హాజరైనంత మాత్రాన, బైబిల్‌ చదివినంత మాత్రాన, ఇంట్లో శిలువ పెట్టుకున్నంత మాత్రాన క్రిస్టియన్‌ అయిపోతాడా? కాడు…’’ అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు రాసింది. పైన పేర్కొన్న మతాచారాలను పాటించేవారు క్రిస్టియన్‌ కాక మరేమవుతారో ‘సాక్షి’ బాధ్యులు చెబితేనే బాగుంటుంది.

ఇక్కడ ఒక వ్యక్తి మతం గురించి కామెంట్‌ చేయడం ఉద్దేశ్యం కాదు. ఏ వ్యక్తి అయినా.. ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చు. జగన్‌ క్రిస్టియన్‌ అని అందరికీ తెలిసిందే. ప్రజలు ఆయన మతాన్ని చూడలేదు. ఆయనలోని నాయకుడికి చూశారు కాబట్టే అఖండ మెజార్టీని కట్టబెట్టారు. ఓ నాయకుడిగా అన్ని మతాలను అయన గౌరవిస్తాడు. అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన ‘సాక్షి’ ఇలా అసందర్భ విషయాన్ని నొక్కి నొక్కి చెప్పడం అవసరమా అనిపిస్తుంది.