లోకేష్‌ను జగన్‌ బాట పట్టించిన చంద్రబాబు

0
444

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ఇప్పటి వరకూ కనీసం వార్డు మెంబర్‌గా కూడా పోటీచేసి గెలవకుండా తండ్రి అధికార అండతో ఏకంగా మంత్రి పదవిని చేపట్టారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పారు. అయితే ప్రజలతో ప్రత్యక్ష సంబంధా లు ఏర్పరచుకోక పోవడం వల్ల గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఎన్నికల అనంతరం ప్రెస్‌మీట్‌ ద్వారా, ట్విట్టర్‌ వేదికగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అప్పుడప్పుడు క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నారనుకోండి.

అయితే టీడీపీ ఆశాదీపం ఆశించిన స్థాయిలో ఇటు ప్రజల్లోనూ, అటు పార్టీ కేడర్‌కు తన నాయకత్వంపై భరోసా కల్పించలేక పోతున్నారు. ఓ వైపు చంద్రబాబును వృద్ధాప్యం వేధిస్తోంది. అయినప్పటికీ ఆయన శక్తి మేర పని చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన రాజకీయ వారసుడిగా లోకేష్‌ డక్కాముక్కీలు తిని ఉండక పోవడంతో ఆశించిన మేరకు రాజకీయ మెచ్యూరిటీని చూపించలేక పోతున్నారు. క్షేత్ర స్థాయిలో తన మాటలతో, చేతలతో తాను నవ్వు పాలు కావడమే కాకుండా, పార్టీని కూడా అపహాస్యం చేస్తున్నారు.

మరోవైపు తన తర్వాత పార్టీ నాయకత్వం విషయంలో లోకేష్‌ ఇతర నాయకులకు ధీటుగా తయారు అయితేనే పార్టీని గుప్పిట పట్టగడని చంద్రబాబు బంగా విశ్వసిస్తున్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి అనునిత్యం ప్రజలతో మమేకం అవడం ద్వారా తనలోని చిన్న చిన్న లోపాలను అధిగమించి తిరుగులేని మాస్‌ లీడర్‌ కాగలిగాడు. ఈ పాయింట్‌ను కూడా గుర్తెరిగిన చంద్రబాబు నాయుడు ఇక లోకేష్‌కు లోక జ్ఞానం కోసం ప్రజల్లోకి పంపాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఇటీవల కాలంలో లోకేష్‌ను క్షేత్రస్థాయి పర్యటనకు ఒంటరిగా పంపుతున్నారు.

ఇటు లోకేష్‌కూడా తనలోని మైనస్‌లు సరిచేసుకోవడానికి, ఎదుటి పక్షాలపై వాడి, వేడి, పసతో కూడిన ఆరోపణలు, సవాళ్లు విసరడానికి అవసరమైన మెచ్యూరిటీ సంపాదించడానికి క్షేత్రస్థాయి నుంచి ఎదగడమే మార్గమని తలుస్తున్నారట. ఈ పర్యటన ద్వారా ప్రజలను ఆకట్టుకునే రీతిలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రసంగించాలి అనే అంశాలపై దృష్టి పెడుతున్నారట. మొత్తానికి ఇప్పటికి లోకేష్‌ ఎక్కడి నుంచి ఎదగాలో తెసుకున్నారన్నమాట.