ఏపీ ప్రభుత్వానికి చినజీయర్‌ స్వీట్‌ వార్నింగ్‌

0
611

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మత రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. ముఖ్యంగా హిందూ మతంపైన, ఆలయాలపైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. ఈ నిరసనను ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ.. ప్రతి విమర్శలు చేస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాలోని బోడికొండపై ఉన్న రామతీర్థం దేవాయంలోని శ్రీరాముని తల నరికి సమీపంలోని కొలనులో పడేశారు దుండగులు. దీనిపై పెద్ద రగడ సాగుతోంది. ఈరోజు ఓవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు రామతీర్ధం చేరుకున్నారు.

వీరితో పాటు పలు హిందూ ధార్మిక సంఘాలు, బీజేపీ కూడా రామతీర్ధంలో ఆందోళన చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లోకి తాజాగా త్రిదండి చినజీయర్‌ స్వామి కూడా వచ్చారు. ‘‘దేవాలయాలను కాపాడాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థలు ఏమైపోయాయి. రాముణ్ణి నమ్ముకుని అక్కడ ఒక వ్యవస్థ ఉంది. వారంతా ఏమయ్యారో అర్ధం కావడంలేదు. ఈ విషయంలో భక్తులు ప్రశ్నించడానికి వెనకాడకూడదు. వ్యవస్థలు విఫలమైనప్పుడు మనం ప్రశ్నించాల్సిందే.. మనకు అండగా ఉండటానికి ఆ శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు ఆయన్ను కాపాడుకోవాల్సిన అవసరం మనకు లేదా అని ప్రశ్నించారు.

సహజంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉండే చినజీయర్‌ ఏ విషయంపై స్పందించాలన్నా ఆచితూచి అడుగు వేస్తుంటారు. రామతీర్ధం ఘటన విచారణ విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆయన మాటలను బట్టి తొస్తోంది. రాష్ట్ర విభజన జరిగాక ఏపీలో శ్రీరామనవమి వేడుకులు అధికారికంగా ఎక్కడ జరపాలి అన్న సంశయం తలెత్తినప్పుడు ప్రభుత్వం కడప జిల్లాలోని ఒంటిమిట్ట దేవాలయంతో పాటు శతాబ్దాల చరిత్రగల విజయనగరం జిల్లాలోని ఈ రామతీర్థాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే తర్జన, భర్జన తర్వాత ఒంటిమిట్టను ఫైనల్‌ చేశారు. ఇంతటి ప్రశస్తమైన దేవాలయంలోని పురాతన రాముని విగ్రహానికి అపచారం జరగడంతో చినజీయర్‌ ఒకింత ఘాటుగానే స్పందించినట్లు భావించాలి.