తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌ది ఓ ప్రత్యేక అధ్యాయం. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి, ఆ తర్వాత టీడీపీలో సుధీర్ఘకాలం పనిచేసి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ను స్థాపించి ఆయన సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
ఇదే ఇమేజ్‌తో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికలలో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు.
బయటకు అడుగు పెట్టడం లేదు. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేటీఆర్, హరీష్‌రావులు ఇద్దరే సమీక్షలు నిర్వహిస్తూ.. కేడర్‌కు ధైర్యం నూరిపోస్తూ ముందుకు పోతున్నారు. అయినా కేడర్‌కు ఉత్సాహం రావడం లేదు.
మాటల మాంత్రికుడు కేసీఆర్ స్పీచ్‌లకు అలవాటు పడ్డ వారు కేటీఆర్, హరీష్‌ల స్పీచ్‌లకు పెద్దగా స్పందించడం లేదు. ఇది ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పెద్ద ఇబ్బందిగా మారే అవకాశంగా కనిపిస్తోంది.
అందరూ కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను మరల అధికారంలోకి తీసుకు రావడంలో విఫలం అయ్యారు తప్ప… రాజకీయంగా పతనం కాలేదు.
ఎన్నికల్లో ఎంతటి గొప్ప నాయకులకైనా గెలుపు, ఓటములు సహజం. ఓటమి ఒక నాయకుణ్ణి మరింత రాటుదేలేలా చేస్తుంది. మరింత ఉత్సాహంతో పనిచేసేలా పురి గొల్పుతుంది.
ఉదాహరణకు చంద్రబాబు నాయుడిని తీసుకుంటే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన ఎక్కడా కుంగి పోలేదు.. పార్టీని ఏదో విధంగా కాపాడుకుంటూ వచ్చి అనూహ్యమైన రీతిలో 2014లో ముఖ్యమంత్రి అయ్యారు.
కాబట్టి పార్టీ ఓటమి చెందింది అని కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు. అయితే కేసీఆర్ ఛరిష్మా కేటీఆర్‌కు కానీ.. ఆయన కూతురుకు కవితకు గానీ.. మేనల్లుడు హరీష్‌రావు కానీ రాలేదు అన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం.
కేసీఆర్ వాగ్ధాటి ఎంతటి వాడినైనా ఒక్క క్షణం ఆయనవైపు తిరిగేలా చేస్తుంది. మాటల మరాటీ అన్నమాట. కాబట్టి మళ్లీ కేసీఆర్ బయటకు వస్తే గానీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించడం సాధ్యం కాదని కేడర్ బలంగా నమ్ముతోంది. అందుకే కేసీఆర్ రంగంలోకి రావాల్సిందే అని గట్టిగా కోరుకుంటోంది.