ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ నాయకుడూ నోటికొచ్చింది మాట్లాడతాడు. కానీ అధికారం వారి చేతికొచ్చిన తర్వాత వారి చిత్తశుద్ధిని వారి చేతలే నిరూపిస్తాయి. అందరు నాయకుల్లానే వై.యస్. జగన్మోహన్రెడ్డి కూడా ప్రజలపై అమితమైన ప్రేమను కురిపించారు. అసలు తాను బతికున్నదే ప్రజలకు సేవ చేసుకోవడం కోసమే అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన అనేక హామీలను ఆయనే గాలికొదిలేశాడు. దీనిపై ప్రశ్నిస్తారనే భయంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
ఎన్నికలకు ముందు తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలను గెలిపించి ఇవ్వండి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాను. లక్షల కోట్ల పెట్టుబడులను తెస్తాను. యువతకు ఉపాధి విషయంలో నా అంత చిత్తశుద్ధి ఇంకెవరికీ లేదు అంటూ ఊదర గొట్టారు. అధికారం అందిన తర్వాత 23 మంది లోక్సభ సభ్యులు, దాదాపు 10 మంది రాజ్యసభ సభ్యులను పెట్టుకుని కేంద్రం మెడలు వంచడం ఏమో గానీ ఈయన మాత్రం తన కేసులకు భయపడి ఢల్లీి పాలకుల దగ్గర మెడలు వంచి వస్తున్నాడనే అపవాదు, విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ పార్టీ నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్ధికి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు అత్యవసరం. అవి లేకపోతే ఆ అభ్యర్ధి ఓడిపోవడం ఖాయం.
ఇటువంటి సువర్ణావకాశం జగన్కు మళ్లీ రాదు. ఇప్పుడే ఆయన ఎన్నికలకు ముందు ప్రజలపై కురిపించిన ప్రేమ, అభిమానాలు వాస్తవమైనవని నిరూపించుకోవాలి. ప్రత్యేక హోదా ఫైలుపై సంతకం పెట్టమని, ఆ తర్వాతే ఓట్లు వేస్తామని షరతు పెట్టాలి. లేకపోతే తటస్థంగా అయినా ఉండి పోతాను అనాలి. అప్పుడే కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఒక వేళ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి లబ్ధి చేకూరకుండా వైసీపీ ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ఇస్తే మాత్రం ఇప్పటికే ఆయనపై ఉన్న అపవాదు అదే ‘‘జగన్ తనపై ఉన్న కేసులకు భయపడి కేంద్రం వద్ద రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెట్టాడు’’ అన్నది నిజమని జగనే నిరూపించుకున్నట్లు అవుతుంది. అంటే జగన్ బండారం బట్టబయలు అయ్యేది తరుణం ఇదే.