అంతేమరి.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు కావొచ్చు.. ఒక్కోసారి శత్రువు కూడా కావొచ్చు.. శత్రువుకి మిత్రుడు మనకు శత్రువు కావొచ్చు..
ఒక్కోసారి మిత్రుడు కూడా కావొచ్చు.. ఏంటి కన్‌ఫ్యూజన్‌గా ఉందా.. ఏం కంగారుపడకండి రాజకీయాలు ఆలాగే ఉంటాయి మరి.
ఇక విషయంలోకి వస్తే నిన్నటి వరకూ కాంగ్రెస్‌ను తమ బద్ధ శత్రువుగా భావించిన షర్మిళ, షర్మిళ(జగన్Gషర్మిళ)ను శత్రువుగా భావించిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కటయ్యాయి.
అంతేకాదు షర్మిళను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమిస్తూ ఈరోజు కానీ రేపు కానీ ప్రకటన విడుదలయ్యే అకాశం మెండుగా ఉంది.
దీనికి ఊతం ఇస్తూ ఈరోజు ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపారు. దీంతో షర్మిళకు ఏపీసీసీకి లైన్ క్లియర్ అయ్యింది.
రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభానికి ఏపీ నుంచి షర్మిళతో పాటు అనేకమంది ఏపీ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో షర్మిళకు మల్లిఖార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ఇదే సమయంలో గిడుగు రుద్రరాజును రాజీనామా చేయాల్సిందిగా కూడా ఆదేశించారట. ఆ మేరకే ఈరోజు గిడుగు తన రాజీనామాను ఢల్లీికి పంపారు.
ఇక షర్మిళ మంచి రోజు చూసుకుని పీసీసీ పగ్గాలు చేపట్టడమే తరువాయి. మరోవైపు షర్మిళ రాకను కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. వీరిలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హర్షకుమార్ ఒకరు.
తనపై ఉన్న వ్యతిరేకతను చెరిపేసుకోవటానికి షర్మిళ హర్షకుమార్ ఇంటికి వెళ్లి ఆయనకు తన కుమారుడి పెళ్లి శుభలేఖ ఇచ్చి వచ్చారు. ఈ పరిణామంతో హర్షకుమార్ షర్మిళకు అనుకూలంగా మారతారని చెప్పలేం.
కానీ షర్మిళ ఒక అడుగు ముందుకు వేసి, హర్షకుమార్‌ను కలవడం ఆమె సన్నిహితులను ఆనందంలో ముంచుతోంది. ఇదే విధంగా పలువురు నేతలను షర్మిళ కలిసి శుభలేఖ ఇచ్చి వారి ఆశీర్వాదం,
అండదండలు కోరుతున్నారట. మొత్తానికి ఒకప్పుడు తన తండ్రి వైయస్సార్ నిర్వహించిన పీసీసీ అధ్యక్ష పదవిని షర్మిళ చేపట్టనుండడం ఆసక్తికరంగా మారింది.
షర్మిళ రాకతో అధికారంలోకి రామని, కానీ కనీసం 10 నుంచి 15 ఎమ్మెల్యేలు గెలవడం ఖాయమని కాంగ్రెస్ ఆశిస్తోంది.