రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఊహించడం చాలా కష్టం. పడిలేచే కెరటాలు కొన్ని అయితే.. లేచి మళ్లీ పడిపోయే కెరటాలు ఇంకొన్ని. ఇంట గెలవక పోయినా.. రచ్చ గెలవాలని చూసే పార్టీలు కొన్ని అయితే.. రచ్చ గెలిచినా ఇంట గెలవలేని పార్టీలు కొన్ని. ఇంట గెలిచి రచ్చ గెలవాలని చూసే పార్టీలు కొన్ని.. ఏంటి కన్‌ఫ్యూజన్‌గా ఉందా… రాజకీయాలు అంతే. ఒకప్పుడంటే విలువలతో కూడిన రాజకీయం నడిచేది కానీ… ఇప్పుడు అంతా తక్షణావసరాలు రాజకీయం. ‘‘ఎప్పటికెయ్యది సేయ తగునో.. అప్పటికది సేయుట మేలు’’ అనేది పార్టీలు బాగా వంటబట్టించు కున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రస్తానం తెలంగాణలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండేది. ఆంధ్ర, తెలంగాణ విడిపోయాక చంద్రబాబు సాయంతో, మోడీ ఇమేజ్‌తో 2014 ఎన్నికల్లో సీట్లు సాధించడమే కాకుండా, మంత్రి పదవులు కూడా నిర్వహించింది బీజేపీ. అయితే 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, పేలవంగా మారింది. అటు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చతికిపడినా.. పార్లమెంట్ ఎన్నికల్లో, దుబ్బాక ఉప ఎన్నికల్లో, హైదరాబాద్ ఎన్నికల్లో ఢంకా బజాయించింది. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరింత దూకుడు పెంచారు. బీజేపీది మతంతో ముడి పడిన రాజకీయం అని అందరికీ తెలిసిందే.
అందుకే వారు ఇష్యూ ఏదైనా సరే.. హిందూ.. హిందూ యేతర అనే కోణంలోనే చూస్తారు.తెలంగాణలో మంచి దూకుడు మీదున్న బీజేపీ ఏపీ వచ్చే సరికి అంత స్పీడ్‌ను చూపించలేక పోతోందనేది నిజం. అయితే ఇక్కడ రాజకీయాల్లో స్థానిక పరిస్థితులను బట్టే గొలుపు, ఓటమి ఉంటాయి. తెలంగాణలో హిందూ ఓటు బ్యాంకును స్వంతం చేసుకోవడంలో విజయం సాధించనంత ఈజీ కాదు ఆంధ్రలో. కానీ బీజేపీ మాత్రం తన దారి రహదారి అన్నట్లు అవే మత రాజకీయాలు ఏపీలో కూడా చేయాలని డిసైడ్ అయింది.
అందుకే రానున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో పోటీ చేసి తమ సత్తా చూపించాలని చూస్తోంది. ఇందు కోసం ‘భగవద్గీత పాలన కావాలా?.. బైబిల్’ పాలన కావాలా అంటూ మతాన్ని మధ్యలోకి తెచ్చింది. ఇక్కడితో ఆగలేదు. ఆంధ్ర బీజేపీ నాయకులు అంత దూకుడును ప్రదర్శించలేరనే నిర్ణయానికి వచ్చిన బీజేపీ అధిష్ఠానం తెలంగాణ బీజేపీ సారధి బండి సంజయ్‌తో సహా మరికొందరు బీజేపీ నాయకులను తిరుపతి ప్రచారానికి పంపించడానికి సన్నద్ధం అవుతోంది.
అంటే ఏపీలో తెంగాణ మార్క్ రాజకీయాన్ని బీజేపీ చేయాలని చూస్తోందన్నమాట. ఇదే తిరుపతి వేదికగా 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సాక్ష్యాత్తూ నాటి ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ ప్రకటించడం.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ఆ విషయాన్ని గాలికి ఒదిలెయ్యడం ఏపీ ప్రజలు మర్చిపోయారు అనే భ్రమల్లో ఉన్నట్లుంది బీజేపీ ఆధిష్టానం. మరోవైపు జనసేన ఈ ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్‌తో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతుండడం కొసమెరుపు.