రాజకీయాలంటేనే అంత… అవసరం తీరాక అల్లుడు ఏదో అయ్యాడట అలా ఉంటది యవ్వారం. నిన్నటి వరకూ నీవే దిక్కని, నీవే నాకు దేవుడివని,
నీ జీవితం నీవు పెట్టిన భిక్షే అని భజనలకే వణుకు పుట్టేలా భజనలు చేసిన నాయకులు రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించి, బండ బూతులు తిట్టడం ఇక్కడ మాత్రమే సాధ్యం.
మళ్లీ అవసరం అయితే సిగ్గు శరం వదిలేసి.. ఇదే నోటితో అదే భజనలు చేయడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విద్యను ఎంతగా ఒంటపట్టించుకుంటే అంతగా రాణిస్తారన్నమాట.
ఈ విధ్యను గట్టిగానే వంటపట్టించుకున్నారు తెలుగదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు. ఈయన గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, సీనియర్ రాజకీయ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు కుమారుడు.
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన నిన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. చేస్తే చేశారు పో.. అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..
రాజీనామా చేయడమే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోను నేలకేసి బాదాడు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం చంద్రబాబును, లోకేష్‌ను తీవ్రంగా దూషిస్తూ రెచ్చిపోయారు.
తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యాపార సంస్థ. చంద్రబాబు, లోకేష్‌లకు ఎప్పుడూ డబ్బు యావ మాత్రమే. నమ్ముకున్న వారికి అండగా నిలవడం వారికి ప్రాధాన్యత కాదు.
మా కుటుంబం కూడా వీరి రాజకీయానికి బలైపోయింది. నాన్నగారిని కూడా వీరు చాలాసార్లు మోసగించారు. గత ఎన్నికల్లో మా నుంచి 150 కోట్లు తీసుకుని మొండిచెయ్యి చూపారు.
ఆ లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి. మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తాడో నేనూ చూస్తాను. నా రాజీనామా లేఖను చంద్రబాబు గారికి పంపించాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఈ పార్టీలో ఇమడలేను.
చంద్రబాబు తన స్వంత ప్రాంతం రాయలసీమలో అంత దారుణంగా ఎందుకు ఓడిపోయాడో ఆ విజనరీనే చెప్పాలి. కన్నా లక్ష్మీ నారాయణ ఓ వర్గం వారి కోసమే పనిచేస్తాడు. కానీ మేము అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తాం.
ఈ విషయం చంద్రబాబు గుర్తించక పోవడం దారుణం అంటూ ధ్వజమెత్తారు. అయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ నుంచి లేదా నరసరావుపేట పార్లమెంట్ నుంచి రంగారావు టికెట్ ఆశించారని, దానికి చంద్రబాబు హామీ ఇవ్వక పోవడం వల్లనే ఆయన ఈ విధంగా పార్టీని దూషించారని తెలుస్తోంది.