
దిల్ రాజు సినీ పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరుపొందిన వ్యక్తి. ఆయన ఎక్కువగా లిమిటెడ్ బడ్జెట్‌లో కొత్త నటీనటులతో సినిమాలు చేయడమే కాదు, వాటిని బ్లాక్ బస్టర్లుగా మార్చిన అనుభవం కూడా ఉంది. అయితే, దిల్ రాజు ఎప్పుడైతే కాంబినేషన్లపై దృష్టి పెట్టి కథను పక్కన పెట్టాడో, అప్పటి నుంచే ఆయన కెరీర్‌లో డౌన్‌ఫాల్ మొదలైందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత కొన్నేళ్లుగా ఆయన నుంచి పెద్ద హిట్ రాలేదన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో బలపడుతోంది.
దిల్ రాజు చేసిన మొదటి భారీ ప్రయోగం గేమ్ ఛేంజర్. శంకర్, రామ్ చరణ్ కాంబోతో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించడంలో ఆయన ముందుండటం ఆశ్చర్యం కలిగించింది. అయితే, దీనికి దిల్ రాజు ఎటువంటి నష్టం ఊహించాల్సిన అవసరం లేదు. మొత్తం సినిమాకి జీ స్టూడియోస్ ఫైనాన్స్ అందించింది. పైగా, ప్రొడక్షన్ పనిని నిర్వహించినందుకు దిల్ రాజుకే జీ స్టూడియోస్ నుంచి చెల్లింపు జరిగిందట. అంటే, లాభం కొంత వరకు దిల్ రాజుదే. అయితే, ఆయన ఈ సినిమాకు కథ కంటే కాంబోపై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. కానీ, సినిమా ఫలితం మాత్రం అందరి అంచనాలను తారుమారు చేసింది.
దిల్ రాజు సంక్రాంతి బరిలోకి సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో దిగారు. గేమ్ ఛేంజర్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన నేపథ్యంలో, ఈ సినిమా ఆ నష్టాలను పూడ్చే ప్రయత్నంగా మారింది. డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ఆదరించి, మీడియా ముందుకు వచ్చి సక్సెస్ సెలెబ్రేట్ చేయడం విశేషం. వీటిలో వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఎల్వీఆర్ మాటల ప్రకారం, ప్రేక్షకులకు కాంబినేషన్, బడ్జెట్ కంటే కంటెంట్ ముఖ్యమని, మంచి కథ ఉంటేనే జనాలు సినిమాకు వస్తారని చెప్పారు. అతను మాట్లాడుతున్న సమయంలో వెనుక నిలబడి దిల్ రాజు నవ్వడం కాస్త ఆసక్తికరంగా మారింది. నెటిజన్లు దిల్ రాజునే ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నా, ఆయన నవ్వుతూ కవర్ చేసుకున్నట్లు కనిపించింది. తమపై ఉన్న విమర్శల్ని కూడా హుందాగా తీసుకోవడమే కాదు, కొంతమంది మాటలకు నవ్వుతూ స్పందించడం ట్రోలింగ్‌కు దారి తీసింది.
దిల్ రాజును ఉద్దేశించి నెటిజన్లు చేసిన కొన్ని వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. “తిడుతోంది మిమ్మల్నే కదా, బడ్జెట్ పెంచి సినిమాలు తీస్తున్నారు, మిమ్మల్నే అంటున్నా మీరు నవ్వడమేంటీ?” అంటూ ప్రశ్నిస్తున్నారు. “సినిమా బాగుంది, చూశాం, ఎంజాయ్ చేశాం, కానీ దీన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాగా చెప్పడం మాత్రం నవ్వులు పూయిస్తోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దిల్ రాజు గతంలో లిమిటెడ్ బడ్జెట్‌లో మంచి కథలతో హిట్లు అందుకున్నప్పటికీ, ప్రస్తుతం ఆయన బడ్జెట్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంబినేషన్‌లు, పెద్ద బడ్జెట్‌లు కాకుండా, మళ్లీ కథలపై దృష్టి పెడితేనే దిల్ రాజు మునుపటి సక్సెస్‌ను తిరిగి పొందగలరని అంటున్నారు.