
సినిమా పరిశ్రమ నిజంగా చాలా విచిత్రమైనది. ఏ సినిమా హిట్ అవుతుందో, ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో ముందుగా ఊహించడం చాలా కష్టం. కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతే, కొన్ని థియేటర్లో అంతగా స్పందన పొందని చిత్రాలు టీవీ, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో దుమ్మురేపుతాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నో సినిమాలకు ఎదురైంది. అలాంటి జాబితాలోనే మహేశ్ బాబు నటించిన “గుంటూరు కారం” కూడా చేరిపోయింది.
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబోలో వచ్చిన “అతడు”, “ఖలేజా” చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దాదాపు పదేళ్ల విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం “గుంటూరు కారం”. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, సరైన ప్రమోషన్ లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.
ఈ చిత్రం మొత్తం రన్లో రూ. 190 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినా, రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోలేకపోయింది. ఫైనల్‌గా రూ. 115 కోట్లే రికవరీ కావడంతో సినిమా కొంత నష్టాలను మూటగట్టుకుంది. కానీ, రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా మళ్లీ థియేటర్లలో ప్రదర్శించగా, బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే టికెట్లు హౌస్‌ఫుల్ కావడం విశేషం.
“గుంటూరు కారం”లోని “కుర్చీ మడతపెట్టి” పాట యూట్యూబ్‌లో 527 మిలియన్ వ్యూస్ సాధించడం గమనార్హం. అలాగే, ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 37.68 మిలియన్ వ్యూస్, 665.8 వేల లైక్స్‌తో “పుష్ప 2” ట్రైలర్ రాక ముందు వరకూ టాప్ ప్లేస్‌లో నిలిచింది. థియేటర్లలో మిశ్రమ స్పందన ఎదురైనప్పటికీ, ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా, టీవీలో కూడా ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
“గుంటూరు కారం” తొలిసారి టీవీలో ప్రసారం చేసినప్పుడు 9.2 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. రెండోసారి ప్రసారం చేసినప్పటికీ 6.13 రేటింగ్ సాధించింది. తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఈ రెస్పాన్స్ గమనించదగినది. అయితే, మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తమిళ బుల్లితెరపై కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. తమిళనాడు ప్రేక్షకులకు మహేశ్ బాబు అంతగా పరిచయం లేని హీరో అయినప్పటికీ, మొదటి ప్రసారంలో 4.5 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఆశ్చర్యకరంగా, రెండోసారి ప్రసారం చేసినప్పుడు ఈ రేటింగ్ మరింత పెరిగి 4.73కు చేరుకుంది. సాధారణంగా ఏ సినిమా అయినా రెండోసారి ప్రసారం చేసినప్పుడు వ్యూయర్షిప్ తగ్గిపోతుంది. కానీ, తమిళ ప్రేక్షకులు “గుంటూరు కారం”ను రెండోసారి మరింత ఆసక్తితో చూసినట్టు కనిపిస్తోంది.
ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల రాకతో తమిళనాడు ఆడియన్స్ ఎక్కువగా డైరెక్ట్ తమిళ సినిమాలనే చూస్తున్నారు. అలాంటి సమయంలో ఓ డబ్బింగ్ సినిమా మంచి టీఆర్పీ సాధించడం మామూలు విషయం కాదు. దీనితో మహేశ్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.