మోసం చేసేవాడు ఒకడున్నాడు అంటే… వాడి చేతిలో మోసపోయేవాడు ఉండబట్టే అంటారు పెద్దలు. ఈ మోసాలు పలు రకాలుగా ఉంటాయి. కాలం మారుతున్న కొద్దీ మోసాలు చేసే పద్ధతులు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల అన్న శ్రీశ్రీ కవితను ఆధారంగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు మోసానికి దేవుడిని కూడా వాడేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశం మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమోగుతుండడంతో ప్రజల దృష్టిని గమనించిన సైబర్ నేరగాళ్లు తమ పనికి పదును పెట్టారు.
శతాబ్దాలుగా వివాదాస్పద ప్రాంతమైన అయోధ్యలో ఎట్టకేలకు కోర్టు తీర్పుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన శ్రీరాముని మందిరంలో ఈనెల 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుండడం అందరికీ తెలిసిందే.
దీంతో దేశంలోని ఊరూ, వాడా శ్రీరాముని గురించే చర్చ. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది అయోధ్యకు తరలి వెళుతున్నారు.
అలా వెళ్లలేని వారు వారివారి ప్రాంతాల్లోని శ్రీరాముని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అన్నిచోట్లా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇలా దేశం మొత్తం భక్తితో మునిగి ఉండగా, సైబర్ కేటుగాళ్లు తమ చోర విద్యలో మునిగిపోయారు. అయోధ్య రామాలయంలో వీఐపీ దర్శనం కల్పిస్తామని, అలాగే అక్షతలు, తీర్ధ ప్రసాదాలను కూడా నేరుగా మీ ఇంటికే పంపుతామని నమ్మ బలుకుతున్నారు.
దీన్ని నమ్మిన వారి ఫోన్‌లకు ఓ లింక్‌ను పంపి, దాన్ని క్లిక్ చేస్తే అన్ని వివరాలు అందులో ఉంటాయని చెపుతున్నారు. నిజమేనని నమ్మి క్లిక్ చేసిన వారి ఖాతాలను గుల్ల చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఇలా వేలాది మందిని ఈ సైబర్ నేరగాళ్లు మోసం చేయడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో కూడా కొందరిని ఈ విధంగా మోసం చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.
ఓవైపు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూనే.. మరోవైపు ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఎటువంటి మెసేజ్‌లకు రిప్లై ఇవ్వద్దని, వారు పంపే లింక్‌లను క్లిక్ చేయొద్దని చెపుతున్నారు.
అంతేగాక ఒకవేళ ఎవరైనా ఇలా మోసపోయి ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా చెపుతున్నారు.