
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగను మరింత ఉత్సాహంగా మార్చింది. బాలయ్య పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, బాబీ తీయించిన విజన్, థమన్ అందించిన అద్భుతమైన బీజీఎం అన్ని కలిసి సినిమా భారీ విజయాన్ని సాధించేందుకు కారణమయ్యాయి. పాజిటివ్ టాక్‌తో సినిమా మొదటి రోజునుంచే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.
సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డాకు మహారాజ్ సినిమా నిర్మాణ దశ నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది.
ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.67.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5.40 కోట్లు సహా మొత్తం రూ.80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.82 కోట్లుగా ఫిక్స్ చేశారు.
ఫస్ట్ షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో డాకు మహారాజ్ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఫస్ట్ డే ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజు రూ.13.50 కోట్లు, మూడవ రోజు రూ.12.50 కోట్లు రాబట్టింది. నాల్గవ రోజు రూ.9.00 కోట్లు వసూలు చేయడంతో నాలుగు రోజుల్లో మొత్తం రూ.59.40 కోట్ల గ్రాస్‌ను ఇండియా బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.95 కోట్ల వసూళ్లను అందుకుంది.
ఇక, డాకు మహారాజ్ థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీని నమోదు చేస్తోంది. వారాంతం వరకు ఈ జోరు కొనసాగితే, సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బాలయ్య మాస్ యాక్షన్, థమన్ సంగీతం, బాబీ డైరెక్షన్ కలిసి డాకు మహారాజ్ సినిమాను పెద్ద విజయంగా నిలబెట్టాయి.