విలువలతో కూడిన రాజకీయాలు అనే మాట రోజూ వింటూనే ఉంటాం. కానీ ఆచరణలో చూడటం చాలా అరుదు. ఇక ఈతరం రాజకీయాల్లో ఈ తరహా రాజకీయాలు చూడగలమా అని అనుకుంటున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ ఆశలు చిగురింప చేస్తున్నారు.
తాజా ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించడంలో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన చేసిన కృషి, చూపిన చొరవ ఇటు పార్టీలోని పాతకాపులతో పాటు, అటు అధిష్ఠానాన్ని కూడా బాగా ఆకట్టుకున్నాయి.
అందుకే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధిష్ఠానం చేపట్టిన అభిప్రాయ సేకరణలో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలకు గాను 49 మంది రేవంత్‌రెడ్డి పేరును ప్రతిపాదించారు.
తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగించాలని, తెలంగాణ ప్రజలకు సరికొత్త పాలన చూపించాలని, తమ పార్టీ చెప్పినట్టు ప్రజాపాలన సాగించాలని రేవంత్‌రెడ్డి డిసైడ్ అయ్యారు.
అందుకే ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నాటి నుండి సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. ఇందులో భాగంగానే తన స్వంత కారునే వాడటం, కాన్వాయ్‌ని 15 కార్ల నుంచి 9కి తగ్గించడం.
కొత్తకార్లు కొనుక్కునే అవకాశం ఉన్నప్పటికీ ఖజానా మీద భారం వేయడం ఇష్టంలేక ఉన్న వాహనాలనే మరమ్మత్తులు చేయించడం వంటి చర్యల ద్వారా ప్రాక్టికల్ పాలన సాగిస్తున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయం ఒకటి ప్రజల్లో, మీడియాలో హాట్ హాట్ చర్చకు దారి తీసింది.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుకు ఉపయోగించిన ప్రగతిభవన్‌ను ప్రజా సౌకర్యార్ధం ప్రజావేదికకు కేటాయించడంతో, సీఎం క్యాంపు కార్యాలయం కోసం అనేక భవనాలు పరిశీలిస్తున్నారు.
ఇందులో భాగంగా నగరంలోని ‘పైగా ప్యాలెస్’ను అధికారులు పరిశీలించారు. దీని చుట్టుపక్కల నివాస ప్రాంతాలు పెద్దగా లేకపోవడంతో ఇది కరెక్ట్‌గా సూటవుతుందని సీఎంకు సూచించారు.
అయితే సీఎం రేవంత్ మాత్రం ‘‘మేం పోరాటం చేసిందే ఈ తరహా ప్యాలెస్‌ల పాలనపైనే. ఇప్పుడు నేనే మళ్లీ ప్యాలెస్లోంచి పాలన సాగిస్తే ఎంత పెద్ద తప్పు అవుతుందో మీకు తెలియదా?’’ అంటూ క్లాస్ పీకారట.
ఇలా వాస్తవిక పాలనపై దృష్టి పెట్టిన రేవంత్ ఎంతకాలం విలువలకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారో చూడాలి. అలా కట్టుబడి ఉండాలని మనమూ కోరుకుందాం.