
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన పేరుకు ముందు బిరుదులు అవసరం లేదని, అనవసరమైన ఫ్యాన్ వార్స్ తనకు ఇష్టముండదని స్పష్టంగా తెలియజేశారు. ఇటీవల దుబాయ్ రేస్ విజయాన్ని అందుకున్న అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో, అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ గురించి ఆయన తన అభిప్రాయాలను తెలిపారు. తనను, విజయ్ను కంపేర్ చేస్తూ, ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఫ్యాన్ వార్స్ చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అజిత్ తన అభిమానులు మిగిలిన సెలబ్రిటీల విషయంలో పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలని, తమ జీవితాలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. తాను అందరి గురించి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. “మీరు మీ జీవితాన్ని గడపడం ఎప్పుడు మొదలు పెడతారు? మీరు నాకు ఇచ్చే ప్రేమకు నేను కృతజ్ఞుడిని, కానీ దయచేసి మీ జీవితాలను కూడా గౌరవించండి. నా అభిమానులు తమ జీవితాల్లో విజయం సాధించినప్పుడు, నా సహనటులతో సత్సంబంధాలను పెంచినప్పుడు నేను నిజంగా ఆనందిస్తాను,” అని అజిత్ తెలిపారు.
అజిత్ జీవితంపై తన ప్రత్యేక దృష్టిని పంచుకుంటూ, మన జీవిత కాలం ఎంతో చిన్నదని, మన ముని మనవళ్లు కూడా మనల్ని గుర్తుంచుకోరని అన్నారు. “కాబట్టి, ఈ రోజు కోసం జీవించండి. గతాన్ని గురించి బాధపడకండి, భవిష్యత్తును గురించి ఆందోళన చెందకండి. ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇవ్వండి. చివరకు మనమందరం ఒకరోజు చనిపోతాం, ఇది నిజం. కాబట్టి శ్రద్ధగా పని చేయండి, సంతోషంగా జీవించండి. శారీరకంగాను, మానసికంగాను ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం,” అని ఆయన తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేశారు.
అభిమానుల మధ్య సహనభావం, ప్రేమ పెరగాలని కోరుకుంటున్న అజిత్, తమ సమయాన్ని మరియు శక్తిని మంచి పనులకు వినియోగించాలని సూచించారు. ఫ్యాన్ వార్స్ లాంటి అనవసరమైన విషయాల్లో పాల్గొనడం ద్వారా ఎవరూ ప్రయోజనం పొందరని ఆయన స్పష్టంగా తెలియజేశారు.
ప్రస్తుతం అజిత్ కుమార్ తన తదుపరి చిత్రం విదాముయార్చి లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. అభిమానులు ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారు. అందరికీ స్పూర్తిదాయకంగా మారిన అజిత్ మాటలు, ఆయన వేదాంత ధోరణి అభిమానులకు మంచి మార్గదర్శకంగా నిలిచాయి.