మారుతున్న లైఫ్ స్టయిల్ తో శరీరానికి చాలినంత వ్యాయమం ఉండడం లేదు. గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చుని మానసికంగా కష్ట పడుతున్నారు కానీ శారీరకంగా మాత్రం ఎటువంటి కష్టం ఉండడంలేదు.
శరీరంలోని పై భాగంలో చూసుకుంటే చేతులతో కీ బోర్డులను ఆపరేట్ చేస్తున్నారు కానీ కింది భాగంలో మాత్రం కాసంతైనా వ్యాయామం ఉండడం లేదు. దీంతో ఆ భాగంలో కొవ్వులు ఎక్కువగా నిండి బలహీణ పడుతుంది.
ఎక్కువ గంటలు కూర్చొని పని చేయడం శరీరానికి శ్రమ లేకుండాపోతోంది. దీంతో తొడ, తుంటి భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీన్ని తగ్గించాలంటే కొన్ని ఆసనాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్కటాసనం
ఈ ఆసనాన్ని ప్రతీ 30 సెకండ్ల విరామంతో 5 సెట్లుగా వేయాలి. ఈ ఆసనం వేసేందుకు సమస్థితో ప్రారంభించాలి. హృదయ చక్రం వద్ద నమస్కార ముద్రలో ఉండాలి.
చేతులను పైకి లేపాలి. మోకాళ్లు వంచి, కటిని నెమ్మదిగా తగ్గించాలి. మోకాళ్ల వద్ద 90 డిగ్రీలు ఉండేలా చూడాలి. దృష్టిని నమస్కారంపై కేంద్రీకరించాలి. వెన్నెముక నిటారుగా ఉండేట్లు చూసుకోవాలి.
తాడాసనం
దీన్ని సమస్థితి అని కూడా అంటారు. రెండు కాళ్లను పాదాలు తగిలేలా దగ్గరగా చేర్చుకోవాలి. చేతులను పైకి చాచి ఉంచాలి. కళ్లు మూసుకొని శరీరాన్ని రిలాక్స్ మోడ్ లోకి తీసుకెళ్లాలి. సాధ్యమైనంత ఎక్కువ సేపు ఈ భంగిమలో ఉండేలా ప్రయత్నించాలి.
ఏక పాదాసనం
ఒంటి కాలిపై శరీరాన్ని నిలిపి ఉంచే భంగిమ. నమస్కార ముద్రతో ప్రారంభమవుతుంది. వీపును నిటారుగా ఉంచి. చేతులను పైకి చాచాలి. ఊపిరి పీల్చుకోవాలి. వీపు భాగాన్ని ముందుకు వంచాలి.
నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత చేతులను చెవుల పక్కగా పోనివ్వాలి. నెమ్మదిగా కుడికాలును పైకి ఎత్తాలి. ఎత్తిన కాలిని నిటారుగా వెనుకకు చాచి ఉంచాలి.
నేలపై ఒక ప్రదేశంలో మీ చూపును నిలపాలి. ఒక కాలితో పూర్తవగానే మరో కాలితో చేయాలి.
ప్రపదాసనం
వజ్రాసనంతో ప్రారంభించాలి. పాదాలను ఒక చోట చేర్చాలి. శరీరాన్ని కాలి మడమలపై సమతుల్యం చేయాలి. వీపును నిటారుగా ఉంచాలి. అరచేతులను రెండు పక్కలా చాచి కనుబొమ్మల మధ్య దృష్టి పెట్టాలి. ఈ భంగిమలో ఉండగా 10 నుంచి 20 సెకండ్ల పాటు శ్వాస తీసుకోవాలి.
వృక్షాసనం
ఇది కూడా ఒంటికాలిపై శరీరాన్ని నిలిపే భంగిమ. సమ స్థితిలో నిలబడి ప్రారంభించాలి. కుడి కాలును ఎత్తి ఎడమ లోపలి తొడపై ఉంచాలి (సాధ్యమైనంత వరకూ). అర చేతులతో పాదానికి మద్దతు కూడా ఇవ్వవచ్చు.
సమతుల్యత చూసుకోవాలి. హృదయ చక్రం వద్ద ప్రాణ ముద్రలో అరచేతులను కలిపి, అదే ముద్రను ఆకాశంవైపు ఎత్తాలి. ఒక కాలు ముగించాక మరో కాలుతో చేయాలి.
ఈ ఆసనాలతో తొడ, తుడి భాగాల్లో కొవ్వును కరిగించవచ్చని హిమాలయ యోగా ఆశ్రమ వ్యవస్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ సూచించారు. వీటితో తొడ, తుటికే కాకుండా వెన్నెముకకు కూడా మంచి మేలు కలుగుతుందని చెప్తున్నారు సిద్ధా అక్షర్.