అఖండ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆదిలోనే నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు
తిరుబాటు బావుటా ఎగరవేయడం అంటుకున్న చిచ్చు ఇటీవల కాలంలో దావానలంలా మారి ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలకు పాకి వైసీపీకి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఈ క్రమంలోనే అనేకమంది ఎమ్మెల్యేలు పార్టీ వైఖరిపై గుర్రుగా ఉన్నారు.
కొందరు బహిరంగంగానే అధిష్టానాన్ని ధిక్కరించేలా మాట్లాడటం.. వ్యవహరించడం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, పెనమలూరు శాసనసభ్యుడు పార్ధసారథి వంతు వచ్చింది.
గత ఎన్నికల్లో పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రిగా, బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మంత్రి పదవిని కూడా ఆశించారు.
అయితే జగన్‌మోహన్‌రెడ్డి లెక్కలు వేరుగా ఉంటాయి కావున ఈయనకు మంత్రి పదవి దక్కలేదు. ఆ సందర్భంగా ఆయన అనుచరులు నియోజకవర్గ కేంద్రంతో పాటు, పలు చోట్ల దిష్టిబొమ్మల దహనానికి కూడా దిగారు.
అప్పట్లో అధిష్ఠానం దూతలు ఈ వ్యవహారాన్ని ఎలాగొలా చక్కదిద్దారు. అప్పుడు సారధి కూడా ఎందుకో మెత్తబడ్డారు. అయితే ఇటీవల నియోజవర్గ మార్పులు,
చేర్పుల్లో భాగంగా పార్ధసారధిని పెనమలూరు అసెంబ్లీ నుంచి కాకుండా మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేయమని అధిష్ఠానం ఆదేశించింది. దీంతో పార్ధసారథి మండిపడ్డారు.
తాను చేస్తే పెనమలూరు నుంచే పోటీ చేస్తానని, మచిలీపట్నం పార్లమెంట్‌కు పోనంటే పోనని చెప్పేశారు. ఇదే విషయం మాట్లాడటానికి జగన్‌మోహన్ దూతగా రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి మంగళవారం పార్ధసారథిని ఆయన పార్టీ కార్యాలయంలో కలిశారు.
దాదాపు గంటసేపు చర్చలు జరిపినప్పటికీ సారథి తగ్గేదేలే అనడంతో అయోధ్యరామిరెడ్డి చేసేది లేక ఒట్టి చేతులతో తాడేపల్లి పార్టీ ఆఫీసుకు చేరుకుని సజ్జలతో విషయం చెప్పారట..
పార్ధసారథిని డీల్ చెయ్యడం కష్టమేనబ్బా.. మీరేమైనా ట్రై చేస్తే చేయండి.. అని బంతిని సజ్జల కోర్టులోకి నెట్టారట. తన సీటు విషయం ఇంత క్రిటికల్‌గా మారటానికి ముఖ్య కారకుడు సజ్జలేననే భావనలో ఉన్న సారథికి ఎదురు పడటం
ఎంత రిస్కో సజ్జలకు బాగా తెలుసు కాబట్టే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యవహారంలో వేలు పెట్టడని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.