ఓ సినిమా సక్సెస్ కు కథ హీరో ఎంత ముఖ్యమో మంచి మాస్ బీట్ ఉన్న సాంగ్ తో పాటు దానికి కొరియోగ్రఫీ కూడా అంతే ముఖ్యం. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో స్టార్ హీరోల సినిమాలలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించి ప్రేక్షకుల మందన అందుకున్న కొరియోగ్రాఫర్స్ లో జానీ మాస్టర్ కూడా ఒకరు. గతంలో ఆయన స్టెప్పులకి ఫేమస్ అయిన జానీ మాస్టర్ ప్రస్తుతం మాత్రం అతనిపై ఉన్న కేసు విషయంలో వైరల్ అవుతున్నారు.కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తన అసిస్టెంట్ పై లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా జైలు జీవితం అనుభవించిన జానీ, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత తన కెరీర్‌ను మళ్లీ పట్టాలపైకి తీసుకురావడంపై దృష్టి పెట్టారు.
ఇటీవల జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన హిందీ సినిమా బేబీ జాన్ లోని “నైన్ మాటక్క” పాట సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అన్ని ప్లాట్‌ఫామ్‌లపై ఈ పాట ట్రెండింగ్‌లో ఉండటంతో జానీ మాస్టర్ మళ్లీ టాప్ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు.అలాగే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని “డోప్” పాటకు కూడా జానీ మాస్టర్ కంపోజిషన్ అందించారు. ఈ పాట కూడా ఇటీవలే విడుదలై ట్రెండ్ అవుతోంది.
ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి జానీ మాస్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. జైలు నుంచి విడుదలైనప్పుడు రామ్ చరణ్ తనకు ఎంతో మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. “నేను బయటకు రాగానే ఫస్ట్ రామ్ చరణ్ గారు నాకు కాల్ చేసి, ‘మీరు అనవసరంగా దేనికి కంగారు పడకు.. నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టి, పని మీద ఫోకస్ పెట్టు’ అన్నారు. బుచ్చిబాబు గారితో చేస్తున్న ప్రాజెక్టులో కూడా కొన్ని పాటలు చేయాలని ప్రోత్సహించారు,” అని జానీ వెల్లడించారు.
ఇప్పటివరకు రామ్ చరణ్‌కి సంబంధించిన ఎన్నో హిట్ సాంగ్స్‌కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. నాయక్ మూవీలో “లైలా ఓ లైలా,” రంగస్థలం లో “జిగేలు రాణి” వంటి పాటలు జానీకి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. రామ్ చరణ్ కెరీర్‌లో బెస్ట్ డ్యాన్స్ నంబర్లుగా నిలిచిన ఈ పాటలు అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో రానున్న సినిమాలో కూడా జానీ మాస్టర్ పాటలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, జానీ మాస్టర్ కెరీర్ మళ్లీ ముందుకు సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.