కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ.. కాదేదీ వివాదాలకు అతీతం అంటారు మన నాయకులు. ఎప్పుడు ఏ విషయాన్ని వివాదాస్పదం చేయాలో రాజకీయ నాయకులకు బాగా తెలుసు.
అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను తమ అమ్ములపొదిలో పెట్టుకుని తిరుగుతుంటారు. అవసరం అయిన వెంటనే ఎదుటివారిపై ఎక్కుపెట్టడమే తరువాయి. ఇలాంటి వివాదాల భారిన పడ్డాయి ఏపీలో సంక్రాంతి శెలవులు.
ఈ సంక్రాంతికి ప్రకటించిన శెలవులను మరో రెండు రోజుల పాటు పొడిగించింది ఏపీ ప్రభుత్వం. రెండు రోజులకు అదనంగా మరో రోజు పొడిగిస్తే మీ సొమ్మేం పోతుంది అంటూ విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు.
ఆసక్తికరంగా మారిన ఈ శెలవుల వివాదంలో లోతుల్లోకి వెళితే… సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఇరు ప్రభుత్వాలూ ఈనెల 12 నుంచి 18 వరకూ శెలవుల మంజూరు చేశాయి.
ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. ప్రతి ఏటా ఇది కామన్‌గా జరిగేదే. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు మరో మూడు రోజులు శెలవులను పొడిగించింది. ఇప్పుడు ఇదే అటు అధికార, ఇటు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి, విమర్శలకు దారి తీసింది.
ఈ శెలవుల పొడిగింపుకు ఏపీ ప్రభుత్వం చెపుతున్న కారణం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరారట. అందుకే శెలవులు పొడిగించినట్లు చెపుతోంది. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోరిక మేరకు సంక్రాంతి శెలవులను పొడిగించటం జరగలేదు.
ఇది నిజంగా విచిత్రమే. అయితే ఈనెల 19న విజయవాడలోని స్వరాజ్ మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఉందని, ఈ కార్యక్రమానికి జనాలను తరలించటానికి బస్సుల అవసరం ఉన్నందున స్కూళ్లకు ఇలా దొడ్డిదారిన శెలవు ఇచ్చారని తెలుస్తోంది.
ఈ విషయమై ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరి స్పందిస్తూ ఈనెల 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఉన్నందున మూడు రోజులకు బదులుగా మరో రోజు శెలవును పొడిగించాలని కోరారు. పలు హిందూ సంఘాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.