మేడారం మహాజాతర.. మన దేశంలో జరిగే అతిపెద్ద జాతరల్లో మొదటి స్థానం కుంభమేళాకు వస్తే.. రెండో స్థానం గిరిజనుల ఆరాధ్యదైవాలు సమ్మక్క`సారలమ్మల మేడారం మహాజాతరకు దక్కుతుంది.
లక్షలాదిగా భక్తులు తరలివచ్చే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి పనులు మొదలు అయ్యాయి. వచ్చేనెలలో మూడు రోజుల పాటు జరిగే ఈ భారీ జాతరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 75 కోట్లను విడుదల చేసింది.
కేంద్రం కూడా తన వంతుగా ప్రతిసారీ నిధులను విడుదల చేస్తుంది. ఈసారి కూడా నిధులు త్వరగా విడుదల చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రులు సీతక్క, కొండా సురేఖలు బుధవారం పాత్రికేయుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మేడారం స్థానిక (ములుగు)శాసన సభ్యురాలు, మంత్రి సీతక్క మాట్లాడుతూ… గత సంవత్సరం భారీ వరదల కారణంగా మేడారం ప్రాంతం కకావికలం అయిపోయిందని, ఈసారి శాశ్వత నిర్మాణాలను చేపడుతున్నామని,
కేసీఆర్ సమ్మక్క`సారలమ్మల జాతరకు 200 కోట్లు కేటాయిస్తామని గతంలో ప్రకటించారని, కానీ అలవాటు ప్రకారం ఆయన ఆ విషయాన్ని మర్చిపోయారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే మేడారం జాతర వచ్చినప్పటికీ సీఎం రేవంత్రెడ్డి 75 కోట్లు కేటాయించారని, ఇంకా కేటాయించే అవకాశం కూడా ఉందని అన్నారు.
సమ్మక్క`సారలమ్మల జాతరకు జాతీయ హోదా కల్పించాలని, ఇందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కృషి చేయాలని మంత్రి కోరారు.
తాత్కాలిక పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టామని, కొన్ని ముఖ్యమైన పనులను శాశ్వత నిర్మాణాలుగా చేపట్టామని, ఈ పనుల నాణ్యత విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చాలా సీరియస్గా తీసుకుంటామని, వారిని ఇంటికి పంపించడంలో కూడా వెనకాడబోమని అన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… మంత్రి అయిన తొలిసారే దేవదాయశాఖామంత్రిగా వనదేవతలు సమ్మక్క`సారలమ్మల జాతరలో పాలు పంచకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను.
లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలే మాకు ముఖ్యం. అందుకే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నారు.