రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ డల్లాస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, శంకర్, సుకుమార్, బుచ్చిబాబు వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. రామ్ చరణ్ చేసిన పవర్ ఎంట్రీ ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఎంట్రీతో ఈవెంట్ కి వచ్చిన అందరూ ఉత్సాహంతో నిండిపోయారు. భారీ క్రౌడ్ హాజరైన ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.
ఈ సందర్భంగా రామ్ చరణ్ తన టీమ్‌ను ప్రశంసిస్తూ, ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, సుకుమార్ టాలెంట్‌ను కొనియాడుతూ, అతని ‘పుష్ప 2’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుకుమార్ సృజనాత్మకత మరోసారి బాక్సాఫీస్‌ను గెలుచుకుందన్నారు. అంటే పుష్ప సక్సెస్ వెనక డైరెక్టర్ హార్డ్ వర్క్ ఎంతో ఉంది అంటూ రామ్ చరణ్ చేసిన మాటలు.. సక్సెస్ లో హీరో రోల్ చాలా తక్కువ అన్నట్టుగా కొందరు భావిస్తున్నారు.
అయితే, ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ పేరు ప్రస్తావనకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెగా కుటుంబం నుంచి ఎవరూ కూడా ‘పుష్ప 2’ సక్సెస్‌ను అభినందించకపోవడం విశేషం. చిరంజీవి, మైత్రీ మూవీస్ ప్రొడ్యూసర్లు కలిసి సమావేశం జరిపినప్పటికీ, చిరు ఇప్పటికీ ‘పుష్ప 2’ చూసారా లేదా అన్నది తెలియదు. మెగా కాంపౌండ్ నుంచి పుష్ప2 భారీ సక్సెస్ సాధించినప్పటికీ ఎటువంటి రియాక్షన్ లేదు.
మరోవైపు, సుకుమార్..రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్‌లో చరణ్ పెర్ఫార్మెన్స్ జాతీయ అవార్డుకు దారితీస్తుందనడానికి విశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే, సుకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘పుష్ప 3’ గురించి కూడా అధికారికంగా ప్రకటించారు. రామ్ చరణ్ నెక్ట్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ పూర్తి చేసిన తరువాత సుకుమార్‌తో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం.
ఈవెంట్ విజయవంతంగా ముగిసినప్పటికీ, ‘పుష్ప 2’ విజయంపై మెగా కుటుంబం మౌనం, అల్లు అర్జున్ పేరు ప్రస్తావించకపోవడం వెనుక కారణాలు సోషల్ మీడియాలో చర్చలకు దారితీస్తున్నాయి. రోజు రోజుకి పెరిగిపోతున్న అల్లు vs మెగా వార్ అభిమానులను కలవరపెడుతోంది.