మంత్రి గారు ప్రభుత్వ పథకాల పంపిణీకి రాను అనడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే.
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ఇకపై ఆ ప్రభుత్వ పథకాల పంపిణీకి రాను అని ఖరాఖండిగా చెప్పేశారు.
ఇదే తాను హాజరవుతున్న ఆ పథకాల పంపిణీ చివరి కార్యక్రమం అని కూడా చెప్పేశారు. ఇంతకీ ఏమిటా పథకాలు.. ఎందుకు మంత్రిగారు రానని చెపుతున్నారు.
వివరాల్లోకి వెళితే సహజంగా ప్రభుత్వ పథకాలు అంటే ఓ పట్టాన అసలు లబ్ధి దారుల చెంతకు చేరవు. వీటికోసం నానా హైరానా పడాలి. ఆఫీసర్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాలి.
ఇంతా చేసినా అవి అందుతాయా అంటే మళ్లీ మధ్యలో ప్రజాప్రతినిథుల రికమండేషన్ ఒకటి ఉండనే ఉంది. దేవుడు కరుణించినా పూజారి కరుణిస్తాడో లేదో అన్నట్టు స్థానిక ఎమ్మెల్యే దీనికి ఆమోద ముద్ర వేయాలి.
అప్పుడు గానీ ఆ పథకం లబ్ధిదారుల చెంతకు చేరదు. ఇలా లబ్ధి దారులు నానా తిప్పల పడి అర్హత సాధించిన పథకాలు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌లు.
గత ప్రభుత్వం హయాంలో వీటి ఎంపికలో అనేక అవినీతి ఆరోపణలు వినిపించాయి. అసలు లబ్ధిదారులకు ఇవి చేరేసరికి పెళ్లి తంతు కూడా పూర్తయ్యేది.
ఇందకు కారణం ఈ పథకం కింద ఎంపిక కాబడేవారిలో దాదాపు 90 శాతం బీఆర్‌ఎస్ సానుభూతి పరులే ఉండేవారట.
దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగానే చెక్కుల పంపిణీ జరిగేది. వారు అందుబాటులో లేకపోతే చేసేది ఏమీ లేదు. వారు ఎప్పుడు కరుణిస్తే అప్పుడే చెక్కులు అందుకునేది.
ఈ విధానం వల్ల లబ్ధి దారులు ఇబ్బందలు పడుతున్నారని, కాబట్టి ఇక నుంచి అధికారులే ఈ చెక్కులను పంపిణీ చేస్తారని,
వీటితో పాటు మిగిలిన పథకాలకు లబ్ధి దారులను కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరి సమక్షంలో ఎంపిక చేస్తారని, ఈ విషయంలో ఎమ్మెల్యేగా తాను ఎటువంటి రికమండేషన్‌లు చేయనని,
అలాగని ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోనని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. సూర్యాపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పై విధంగా వ్యాఖ్యానించారు.
ఇటీవల తాను అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని చెక్కుల పంపిణీ అగిపోయిందని, దానివల్ల లబ్ధిదారులు బాధలుపడ్డారని, అందుకే ఇక తాను అందుబాటులో ఉన్నా..
లేకున్నా పథకం మంజూరు అయితేచాలు నేరుగా అందుతుందని అన్నారు. ప్రజల బాధలు అర్ధం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్న కోమటిరెడ్డిని నిజంగా అభినందించి తీరాల్సిందే.