అధికారం అనేది తేనె లాంటిది. అది ఎక్కడున్నా తేనెటీగలకు ఇట్టే తెలిసిపోతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో ఉంటూ వీలైనంతగా అధికారాన్ని అనుభవించడం, అధికార మార్పిడి జరిగే అవకాశాలు కానీ కనపడితే జంప్ జిలానీ అవతారం ఎత్తడం పాలిట్రిక్స్‌లో మామూలే.
మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ హోరాహోరీగా ప్రత్యర్ధులతో తలపడక తప్పేలా లేదు.
అయినా గెలుపు అవకాశాలు పక్కా అని చెప్పలేని పరిస్థితి. పరిస్థితి లోతుగా గమనిస్తే కొంత ప్రతిపక్ష టీడీపీGజనసేన కూటమికే ఎడ్జ్ కనిపిస్తోంది.
పులివెందుల నుంచి షర్మిళ పోటీ…?
దీంతో వైసీపీలోని కొందరు ద్వితీయశ్రేణి నాయకులు, తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా పార్టీ ప్రారంభం నుంచీ జగన్‌నే నమ్ముకుని ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ పార్టీని వీడుతున్నారు. రేపు కాకినాడకు రాబోతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ను కలవటానికి అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు.
ఈ మేరకు ఆయన తన అనుచరులకు సమాచారం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం విశాఖ వైసీపీలో కాకపుట్టిస్తోంది. పార్టీ ప్రారంభం నుంచీ ఉన్న ఆయన ఆర్థికంగా కూడా పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టారు.
విశాఖ కార్పొరేషన్‌కు మేయర్ కావాలనే ఉద్దేశంతో ఆమధ్య జరిగిన గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా కూడా పోటీ చేశారు. అయితే జగన్ ఈయన్ను కాదని హరికుమారికి ఆ పదవిని కట్టబెట్టారు.
అప్పటి నుంచి వంశీ పార్టీపై కోపంగా ఉన్నారు. ఆయన్ను స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీని చేశారు జగన్. అయినప్పటికీ వంశీకృష్ణ మెత్తబడలేదు.
2019లో వైసీపీకి అనుకూలంగా అంతటి గాలి వీచినప్పుడు కూడా విశాఖలో నగరంలో ఒక్కసీటు కూడా వైసీపీ గెలవలేక పోయింది.
ప్రస్తుతం పార్టీపైన, ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో వంశీకృష్ణ ముందు జాగ్రత్తగా జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రేపు పవన్‌తో జరిగే భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.