అందుకే అంటారు.. నోరుంది కదా అని దూలకొద్దీ ఏదీ మాట్లాడకూడదు అని. కానీ మన నాయకులకు నలుగురు కార్యకర్తలు ఒక మైక్ కనపడితే చాలు పూనకం వచ్చేస్తుంది. ఏది పడితే అది, ఎంతపడితే అంత మాట్లాడేస్తుంటారు.
వీరి మాటలకు మండిన అపొజిషన్ వాళ్లు ఊరుకుంటారా ఏంటి? వాళ్లు కూడా దానికి మించిన కౌంటర్ ఇస్తుంటారు. ఇలా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
ఇటీవల పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో కేటీఆర్ తన తండ్రి, పార్టీ చీఫ్ కేసీఆర్ గురించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు త్వరలోనే పులి బయటకు వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.
ఈ విషయం మీద లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ అభిమానులు ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఘాటుగా స్పందించారు. మేం కూడా ఆ పులి ఎప్పుడు భయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం.
పులి అంట, ఇంట్లో పండుకుందంట, లేచి వస్తుందట. దాన్ని బంధించటానికి కావాల్సిన వలలు, ఉచ్చు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. దాన్ని బంధించి చెట్టుకు వేళాడదీస్తారు మా కార్యకర్తలు జాగ్రత్త అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
అంతే కాక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని వంద మీటర్ల లోతు గొయ్యి తీసి, అందులో పాతిపెడతానని కూడా అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ… నేనేమీ మా అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు.. మంత్రిని కాలేదు. నా స్వశక్తితో 20 ఏళ్లు రాజకీయాల్లో కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా.
మీకు ఓడినా ఇంకా ఆ నియంత పోకడలు దిగలేదు. ఇగ ఖచ్చితంగా దింపుతాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీరో, మేమో తేల్చుకుందాం. రాష్ట్రం దాటి వచ్చిన తర్వాత రాజకీయాలు మాట్లాడకూదని నిర్ణయించుకున్నా.
అందుకే నాలుగు రోజులుగా రాజకీయాలు మాట్లాడం లేదు. కానీ తెలంగాణలో తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ సుపరిపాలన చేస్తున్న ప్రభుత్వంపై చేస్తున్న దాడులు, కుట్రలు, మితిమీరిన మాటలు చూసిన తర్వాత తప్పక స్పందిస్తున్నాను అన్నారు.
తాము నిస్వార్ధంగా ప్రజల కోసం పనిచేస్తున్నామని, మీలాగా దోపిడీలు, ఆస్తులు గుంజుకోవటాలు, బెదిరింపులకు పాల్పడటాలు చేయడం లేదని అన్నారు.