పవన్ కల్యాణ్ సినిమా నటుడిగానే కాక జనసేన అధినేతగా కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయంగానూ కీలక భూమిక పోషిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా పోటీ చేసి ఒకే ఒక్కసీటు సాధించుకున్నారు.
ఆ ఒక్క ఎమ్మెల్యేల కూడా ఆతర్వాత జారిపోయారనుకోండి అది వేరే విషయం. ఆ తర్వాత బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాల కారణంగా బీజేపీతో కలిసి నడుస్తున్నారు. 2024లో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారు కావడంతో ఈసారి ఎలాగైనా చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు టీడీపీతో పొత్తు కొనసాగిస్తూనే మరోవైపు బీజేపీతో సైతం స్నేహం కొనసాగిస్తూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నాడని, ఇందుకు కేంద్రంలోని బీజేపీ సహకారం పూర్తి స్థాయిలో ఉందని, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు కావడంలో కూడా ఆ పార్టీకి కూడా వాటా ఉందని టీడీపీ ఆరోపిస్తూ ఉంది. దీనికి తోడు ఇటీవల చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
జెడ్ కేటగిరీ రక్షణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తిని అక్రమ కేసులతో అరెస్ట్ చేయడం కేంద్రం సహకారం లేకుండా జరిగేపని కాదు అని తెలుగుదేశం భావన దీంతో వైసీపీ, బీజేపీ ఒకటేనని.. పవన్ బీజేపీతో కలిసి నడుస్తూ తమతో అడుగులు వేస్తామంటే ఎలా సాధ్యం అనేది టీడీపీ వెర్షన్.
దీనికి తోడు మైనార్టీ ఓట్ల విషయంలో కూడా బీజీపీతో ఉంటే ఇబ్బంది ఎదురౌతుందని ఇటీవల తనను కలిసిన పవన్‌తో చంద్రబాబు అన్నట్టు సమాచారం. ఈ కారణంగా గురువారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ తాను బీజేపీతో ఉండటం వల్ల తన అభిమానులు అయిన మైనార్టీలు కూడా తనతో రాలేకపోతున్నామని చెపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో బీజేపీలో కలవరం మొదలైంది. అసలే 0.6 ఓట్లతో ఆంధ్రప్రదేశ్‌లో ఎలా మనుగడ సాగించాలో తెలియక పవన్ మీద ఆశలుపెట్టుకుంటే ఆయన కాస్తా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇలా తమకు హ్యాండ్ ఇచ్చేలా వ్యాఖ్యానించడం బీజీపీలో అలజడికి దారి తీస్తోంది.