ఎక్కడైనా బావ ఓకే గానీ.. వంగతోట దగ్గర మాత్రం కాదట. ఈ సామెత పాలిటిక్స్‌కు బాగా వర్తిస్తుంది. అప్పటి వరకూ అధికారం వెలగబెడుతూ ప్రజలంటే పూచికపుల్లతో సమానంగా చూసిన నాయకులకు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వారిపై అపారమైన ప్రేమ కారిపోతుంది.
ఇంకా చెప్పాలంటే ప్రజల కోసం అవసరం అయితే స్వంత కుటుంబ సభ్యులను కూడా వదులుకునేందుకు సిద్ధపడతారు. (ఇది కేవలం ఎన్నికలు పూర్తయ్యే వరకు మాత్రమేనండోయ్).
తాజాగా కడపజిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి కూడా ప్రజలే ముఖ్యమైపోయారు. వారి కోసం ప్రభుత్వాన్ని సైతం ఎదిరించటానికి వెనకాడటం లేదు.
జగన్ వీరవిధేయ ఎమ్మెల్యేకు ఇంత కష్టం ఎందుకు వచ్చిందా అని ఆరాతీయగా, గురువారం నాడు కడపజిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు ఆకస్మిక తనిఖీలు మొదలు పెట్టారట.
ఇందులో భాగంగా బంగారం కొనుగోళ్ల కోసం వచ్చిన సామాన్యుల నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం మొదలు పెట్టారట.
మన దేశ వాణిజ్య రాజధాని బొంబాయి తర్వాత ప్రొద్దుటూరు బంగారం అమ్మకాలకు ఫేమస్. దీంతో రాష్ట్రం నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బంగారం కొనుగోళ్ల కోసం వస్తుంటారు.
ఈ క్రమంలో గురువారం పోలీసులు స్థానికంగా ఉన్న దుకాణాలతో పాటు, కొనుగోలుకు వచ్చిన ప్రజల దగ్గర నుంచి కూడా సొమ్ములు సీజ్ చేస్తుండడంతో గోల్డ్ వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. వీరంతా ఎమ్మెల్యే రాచమల్లు దగ్గరకు వెళ్లి పరిస్థితిని వివరించారట.
సహజంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాత్రమే ఇలా సోదాలు నిర్వహిస్తారు. కానీ ఇప్పటి నుంచే సోదాలు అంటే కష్టమని, అవసరం అయితే ఎన్నికలు ముగిసే వరకూ వ్యాపారాలు మూసేస్తామని అన్నారట. దీంతో ఎమ్మెల్యే రాచమల్లు పోలీస్ అధికారులతో చర్చించారు.
అయినా పెద్దగా ఫలితం లేకపోవడంతో ముఖ్యమంత్రి జగన్‌కు, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తిని చేశారట.
పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారస్తులు బాగా ఇబ్బంది పడతారని, దీనివల్ల రాబోయే ఎన్నికల్లో తనకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని భావించిన ఆయన తనకు ప్రజలే ముఖ్యమని, వారికి ఇబ్బంది కలిగే చర్యలను అంగీకరించబోనని అవసరం అయితే సీఎంతో మాట్లాడతానని కూడా అంటున్నారట.