ఎవరు ఏమనుకున్నా సరే.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు. ఓవైపు కేవలం సంక్షేమ పథకాలతో కాలం గడుపుతూ.. అభివృద్ధిని పట్టించుకోవడం లేదంటూ..
అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు ముక్త కంఠంతో ఘోషిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అదరహో అంటోంది.
ఎన్నికలు ఇంకా పట్టుమని మూడు రెండు నెలల కూడా లేని ఈ సమయంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై ఓ ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటన చూస్తే అసలు నవ్వాలో.. ఏడ్వాలో కూడా అర్ధం కాదు..
ఇందులో ప్రభుత్వం గడచిన 55 నెలల వైఎస్సార్ సీపీ పాలనలో ఇప్పటి వరకూ 311 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యాయని పేర్కొంది.
ఈ పరిశ్రమల ద్వారా ఒక లక్ష 30 వేల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగా మరో 2 లక్షల మందికి ఉపాధి దొరికిందని కూడా చెప్పింది.
గత సంవత్సరం విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో భాగంగా నాడు పెట్టుబడి దారులు చేసుకున్న 386 ఒప్పందాల్లో భాగంగా ఈ పరిశ్రమలు ఏర్పడ్డాయట.
ఆ ఒప్పందాలు అన్నీ త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయని, అప్పుడు 6 లక్షల మందికి ఉపాధి దొరకుతుందని ఆంధ్రప్రదేశ్ సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది.
అంతేకాదు.. 3.94 లక్షల యూనిట్లు కేవలం ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే ఏర్పాటు చేయబడ్డాయట. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన రీస్టార్ట్ ప్యాకేజ్లో భాగంగానే ఇవన్నీ పురుడు పోసుకున్నాయట.
ఇదంతా కేవలం వైసీపీ అధికారంలోకి వచ్చిన 55 నెలల కాలంలోనే జరిగినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు 16,000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో కాకినాడ గేట్వే, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధి జరుగుతోందని,
ఇవన్నీ అందుబాటలోకి వస్తే మొత్తం కోస్తాంధ్ర ప్రాంతం అభివృద్ధి నోచుకుంటుందని, దీని ద్వారా 75 వేల మందికి ఉపాధి దొరుకుతుందని, పరోక్షంగా 1 లక్ష మందికి ఉపాధి దొరుకుతుందట.
వీటితో పాటు 3,793 కోట్ల రూపాయలతో మరో 10 వరకూ ఫిష్షింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని, 50 కి.మీ ఒకటి చొప్పున వాటిని అందుబాటులోకి తెస్తున్నారట.
ఇలా చేతికి దొరికిన అనేక అబద్ధాలను అందులో రాసేసి మీడియాకు వదిలేశారని విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టారు. చూడాలి మరి ప్రజలు వీటిని నమ్ముతారో? లేదో?.