పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ జోనర్ సినిమా రాజా సాబ్. ఈ చిత్రం షూటింగ్ కొన్ని నెలల క్రితమే ప్రారంభమై, ఏప్రిల్ 10న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ లుక్స్, మోషన్ పోస్టర్స్ ద్వారా ఇప్పటికే మంచి హైప్ సృష్టించారు. అయితే, ఈ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఇకపోతే, రాజా సాబ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, అలాగే వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. ఆపై ప్రభాస్ గాయపడ్డ విషయాన్ని ఇటీవల వెల్లడించారు, అందువల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్ల రాజా సాబ్ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
ఈ గ్యాప్ ను చిన్న సినిమాలూ బాగా యూజ్ చేసుకుంటున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమా విడుదల తేదీని ఏప్రిల్ 10న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అదే తేదీపై లాక్ చేయడంతో రాజా సాబ్ వాయిదా పడే అవకాశాలపై చర్చ మొదలైంది.
ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల విడుదల తేదీ వాయిదా వేయడం చిన్న సినిమాలకే లాభం. పెద్ద బడ్జెట్ సినిమాలు తప్పుకుంటే, చిన్న చిత్రాలకు మరింత థియేటర్ స్థలం లభించి మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంటుంది. ఇది సిద్దు జొన్నలగడ్డ, నితిన్ వంటి మిడ్-రేంజ్ హీరోల సినిమాలకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది.
అదేవిధంగా, అదే రోజు నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా కూడా విడుదల కావచ్చని టాక్. మరోవైపు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న జాట్ సినిమా కూడా ఏప్రిల్ 10న విడుదల చేయాలని రాజా సాబ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పరిశీలిస్తోందట. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10న భారీ సినిమా పోటీ కనిపిస్తోంది.