రెండేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రినీ తన వెంట తీసుకెళ్ళారు. ఎలాంటి రాజకీయాల్లేవు. వైషమ్యాలు లేవు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా భేటీ కొనసాగింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాల మాట తప్పితే వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. ఇది కదా సమాఖ్య వ్యవస్థ బలోపేతానికి స్ఫూర్తినిచ్చే భేటీ.
ఇంతకీ అసలు విషయం ఏమిటనేది అర్ధం అయ్యుంటుదనుకుంటా.. విషయం లోకి వెళ్దాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత నెలాఖరులో ఢల్లీిలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను పీఎం మోదీ అభినందించారు. మర్యాదపూర్వక భేటీ ఆరగంటకు పైనే కొనసాగగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు, విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉన్న హామీలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్ళారు.
లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెండిరగు ప్రాజెక్టులకు అనుమతులతో పాటు నిధులు విడుదల చేయాలని విన్నవించారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ ప్రాజెక్టులు, ఐఐఎం, సైనిక్ స్కూల్ మంజూరి చేయాలని కోరారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ప్రధానిని కోరారు.
సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. రాష్ట్రాలకు ఇవ్వాలినవన్నీ తెలంగాణకు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ పీఎం మోదీని కలవడంతో ఇప్పటి వరకు గత ప్రభుత్వంతో పీఎం మోదీకి మధ్య ఉన్న అంతరం తొలిగిపోయింది.
2021 సెప్టెంబరు నెలలో అప్పటి సీఎం కేసీఆర్ ఢల్లీిలో ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, నిధుల మంజూరికి సంబంధించిన వినతి పత్రాన్ని అందచేశారు. సీఎం కేసీఆర్, పీఎం మోదీల మధ్య అదే చివరి భేటీ. ఆ తరువాత ఇరువురూ ఎప్పుడూ కలుసుకోలేదు.
ఆ తరువాత పీఎం మోదీ పలు మార్లు తెలంగాణలో అధికారిక పర్యటనలు చేసినప్పటికీ సీఎం కేసీఆర్ వెళ్ళి స్వాగతించడం కానీ, కలవడం కానీ చేయలేదు. ప్రొటోకాల్ నిబంధనలు కూడా పాటించలేదనే విమర్శలు ఉన్నాయి.