
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పుష్ప సిరీస్ తొలి భాగం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ విజయాన్ని మించిపోయే స్థాయిలో పుష్ప 2 ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ. 450 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించింది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ వంటి పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. టీజర్, ట్రైలర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల వల్ల విడుదలకు ముందే పుష్ప 2పై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త రికార్డ్ నెలకొల్పింది.
పుష్ప 2 గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11,000 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. తొలి రోజు రూ. 294 కోట్ల గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి వారంలోనే రూ. 1000 కోట్లు, రెండో వారంలో రూ. 1400 కోట్లు, 21 రోజులకు రూ. 1700 కోట్లు, 32 రోజులకు రూ. 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు పుష్ప 2 రూ. 850 కోట్ల షేర్ అందుకుంది. ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు దాదాపు రూ. 230 కోట్లకు పైగా లాభాలు పొందారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో భారీ నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ హిందీ బెల్ట్‌లో మాత్రం ఈ సినిమా దిమ్మతిరిగే వసూళ్లు సాధించింది.
మూవీ విడుదలైన కొన్ని వారాల తర్వాత రీలోడెడ్ వెర్షన్ పేరుతో 20 నిమిషాల అదనపు ఫుటేజ్ జోడించడం సినిమా కలెక్షన్లను మరింత పెంచింది. అయితే జనవరి 30 నుంచి పుష్ప 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండటంతో థియేటర్ల రన్ పూర్తయినట్లేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక 59వ రోజు కలెక్షన్లను పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 10 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. సినిమా ఓటీటీలో అందుబాటులోకి రావడంతో థియేటర్లలో ఇకపైన పెద్దగా వసూళ్లు రావొచ్చని చెప్పలేం. అయినప్పటికీ, పుష్ప 2 భారతీయ సినీ పరిశ్రమలో టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం నార్త్ మార్కెట్లో ఇంకా కొన్ని థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతుండడం గమనార్హం.
పుష్ప 2 నాన్-థియేట్రికల్ రైట్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్ డీల్స్ వల్ల నిర్మాతలకు భారీ లాభాలను అందించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేసినట్లైంది. ఇప్పుడు అందరి దృష్టి పుష్ప 3 పై పడింది!