ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న పుష్ప 2 సినిమా ప్రస్తుతం విమర్శలు, వివాదాలతో కూడిన అంశంగా మారింది. డిసెంబర్ 4న హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అందరికీ షాక్ ఇచ్చింది. పుష్ప 2 బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ తన కుటుంబంతో హాజరయ్యారు. ఆయన ర్యాలీ నిర్వహించిన సమయంలో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలతో చికిత్స పొందుతున్నారు.
అనుకోకుండా ఈ సంఘటనకు రాజకీయ కోణం యాడ్ కావడంతో ఈ ఇష్యూ మరింత పెద్దదిగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి అతని ఇంటి పై దాడి వరకు అన్ని సంచలనంగా జరిగాయి. ఇక ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఇక్కడితో విషయం ఆగిపోలేదు ఇంకా పుష్ప2 చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి.
సంధ్య థియేటర్ ఘటన తర్వాత రాయదుర్గం లోని మరో థియేటర్‌లో పుష్ప 2 సినిమా చూస్తున్న ఓ యువకుడు అనుకోని పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిణామం పుష్ప 2 చుట్టూ మరింత ఉత్కంఠను కలిగించింది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మరొక విషాదం చోటు చేసుకుంది. పుష్ప 2 సినిమాను చూడాలి అని భావించిన ఆమె అదే విషయాన్ని తన బాయ్ ఫ్రెండ్ కి వ్యక్తం చేసింది. అయితే అతను దానికి ఒప్పుకోకపోవడంతో కోపంతో మూడు అంతస్తుల భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో క్రిటికల్ కండిషన్లో ఉంది.
మరోపక్క అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1600 కోట్ల కలెక్షన్లు సాధించింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమా విజయంతో అల్లు అర్జున్ తన స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం వివాదాల కారణంగా అల్లు అర్జున్ పై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చిత్రం చుట్టూ నెలకొని ఉన్న వివాదాలు అతని అభిమానులను కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు అల్లు అర్జున్ కి మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు అతనిపై విమర్శలు సంధిస్తున్నారు.