అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటనలో ఒక మహిళ మరణించగా, మరో పసిప్రాణం ప్రాణాలతో పోరాడుతోంది. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం ఎవరో అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ షోకు సడెన్ ఎంట్రీ ఇవ్వడంతోనే తొక్కిసలాటకు కారణమైందని కొందరు అంటున్నారు. అయితే, బాధ్యత ఎవరిది అనే అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. పోలీసులు అల్లు అర్జున్ను వెళ్లమని చెప్పినప్పటికీ, ఆయన అక్కడే ఉండటమే సమస్యకు కారణమని రేవంత్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అయితే, ఆయనకు వెంటనే బెయిల్ లభించింది. మొన్నటి వరకు అల్లు అర్జున్ కి మద్దతుగా నిలిచిన ఎందరో ఇప్పుడు అతనిపై విమర్శలు సంధిస్తున్నారు.
ఇదిలా ఉండగా, టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ ఘటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత ఆయన అల్లు అర్జున్ను మద్దతు పలుకుతూ చిత్ర పరిశ్రమను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అన్నారు. కానీ, సీఎం వ్యాఖ్యల తర్వాత తన ముందున్న సమాచారంలో పొరపాటు ఉందని, అల్లు అర్జున్ చేసినది తప్పేనని ప్రకటించారు. ఈ మార్పు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యమా, పోలీసులు నా, లేక అల్లు అర్జున్ మానేజ్మెంట్ బాధ్యత వహించాలా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసుల చేతులెత్తడం, అభిమానుల ఉత్సాహాన్ని అదుపు చేయలేకపోవడం, సంఘటన తీవ్రతను పెంచినట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ కేసు కోర్టు మెట్లు ఎక్కడంతో కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. బాధిత కుటుంబం న్యాయం కోరుతుండగా, టాలీవుడ్ నుంచి కూడా ఈ అంశంపై తీవ్ర నిరీక్షణ కొనసాగుతోంది. మరి ఈ వివాదం ఎలా పరిష్కారం కానుందో చూడాలి.