
సంక్రాంతి పండుగకు విడుదలైన అన్ని సినిమాల్లో, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రేక్షకుల మనసులు దోచుకుని భారీ విజయాన్ని సాధించింది. థియేటర్ల ముందు క్యూ కడుతున్న ప్రేక్షకుల రిస్పాన్స్ చూస్తే సినిమా ఎంతగా హిట్టైందో అర్థమవుతోంది. బ్రేక్ ఈవెన్ మాత్రమే సాధిస్తే చాలని భావించిన ఈ సినిమా, ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రెండు పెద్ద సినిమాల పోటీని తట్టుకుని ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లియర్ విన్నర్‌గా నిలవడం గమనార్హం.
రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల షేర్ ను కొల్లగొట్టడంతో పాటు, ఓవర్సీస్ మార్కెట్ లో 3 మిలియన్ డాలర్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా కథ అంత కొత్తది కాదు. టేకింగ్ కూడా రొటీన్‌గా అనిపించినా, భారీ ఫైట్లు, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు లేకపోయినా సినిమా ఈ స్థాయిలో హిట్టవ్వడం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశం.
ఈ విజయానికి ప్రధాన కారణం ప్రేక్షకుల వినోదాన్ని టార్గెట్ చేయడం. లాజిక్స్ పక్కన పెట్టి కేవలం వినోదాన్ని అందిస్తే ప్రేక్షకులు ఎలాగైనా థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేస్తారు అని ‘జాతిరత్నాలు’ అప్పట్లో చూపించినట్లే, ఇప్పుడు ఈ విషయాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమాలో వింటేజ్ వెంకీని చూపించడం సినిమా పెద్ద బలంగా మారింది. వెంకటేష్ అభిమానులు ఎప్పటినుంచో ఆయన నుంచి మిస్సయిన ఆ మాస్, ఫన్ ఎలిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఎమోషన్‌ను ఈ సినిమా సరిగ్గా క్యాచ్ చేసి చూపించింది.
దీనికితోడు, సంక్రాంతి పండుగ సీజన్లో కుటుంబ సమేతంగా చూడదగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రాన్ని ప్రెజెంట్ చేయడం, ‘గోదారి గట్టు’ పాట తెగ వైరల్ కావడం సినిమా విజయానికి కీలకంగా మారాయి. అంతేకాదు, మిగతా రెండు పెద్ద సినిమాలతో పోలిస్తే టికెట్ ధరలను కాస్త తక్కువగా నిర్ణయించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎంచుకున్నారు.
పాన్ ఇండియా సినిమా అంటూ బిల్డప్‌లు ఇవ్వకుండా, పక్కా తెలుగుతనం జోడించి పూర్తిగా కుటుంబ ప్రేక్షకుల్ని టార్గెట్ చేయడం, వినూత్నంగా, క్లాసిగా ప్రమోషన్స్ చేయడం సినిమాకు మరో బలంగా నిలిచాయి. ఇలా చూడగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకోవడం వెనుక దర్శకుడి టాలెంట్, వెంకటేష్ మాజికల్ పెర్ఫార్మెన్స్, అలాగే కుటుంబాలను ఆకర్షించే కథనమే కారణం అని చెప్పవచ్చు.