
మెగా ఫ్యామిలీకి గత సంవత్సరం మంచి విజయాలను అందుకున్నప్పటికీ, సినిమాల పరంగా మాత్రం కొన్ని నిరాశలు ఎదురయ్యాయి. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించడం, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం, పవన్ కల్యాణ్ జనసేన పార్టీ విజయంతో ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, రామ్ చరణ్ చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందడం, నాగబాబు ఏపీ మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం వంటి విజయాలు మెగా అభిమానుల ఆనందానికి కారణమయ్యాయి.
అయితే, బాక్సాఫీస్ వద్ద మెగా హీరోలు ఆశించిన స్థాయి విజయాలు సాధించలేకపోయారు. చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా భారీ డిజాస్టర్ అయింది. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలసి నటించిన ‘బ్రో’ సినిమా కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు. వరుణ్ తేజ్ నటించిన సినిమాలు ‘గని,’ ‘గాండీవధారి అర్జున,’ ‘ఆపరేషన్ వాలెంటైన్,’ ‘మట్కా’ తీవ్రంగా నిరాశపరిచాయి. వైష్ణవ్ తేజ్ కూడా ‘ఉప్పెన’ తర్వాత విజయాలను అందుకోలేకపోయాడు. తాజాగా ‘ఆదికేశవ’ సినిమా డిజాస్టర్ అయ్యింది.
రామ్ చరణ్ సింగిల్‌గా విజయాన్ని సాధించి చాలా కాలం అయింది. తండ్రితో కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్ గా మారింది. RRR అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినప్పటికీ, ఆ స్టార్డమ్ ‘ఆచార్య’ను కాపాడలేకపోయింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా మీద అభిమానులు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆ సినిమా మిక్స్డ్ టాక్‌తో తీవ్ర నిరాశనే మిగిల్చింది. మొదటి రోజున మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ఆ తర్వాత వసూళ్లు పడిపోయాయి.
ఇప్పటి పరిస్థితుల్లో ‘విశ్వంభర’ సినిమా మెగా ఫ్యామిలీకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానుంది. మొదట ఈ సినిమా సంక్రాంతికి రావాల్సి ఉండగా, ‘గేమ్ ఛేంజర్’ కోసం వాయిదా వేసుకున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా మార్చి 28న విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం OG, హరి హర వీర మల్లు తో బిజీ గా ఉన్నారు. మరో పక్క సాయి ధర్మ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలపై దృష్టి సారించగా, రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ కూడా మేర్లపాక గాంధీతో ఒక హారర్ కామెడీ సినిమా ప్రారంభించబోతున్నారు. చిరంజీవి మరోసారి వరుస ప్రాజెక్ట్స్‌తో అభిమానులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ‘విశ్వంభర’ మంచి విజయం సాధిస్తే, మెగా ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది.