
రేణూ దేశాయ్ సమాజంలో మంచి మార్పు రావాలని కోరుకుంటూ, తన వంతుగా సహాయపడేందుకు ఎప్పుడూ ముందుంటారు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత ఆమె తన ఇద్దరు పిల్లలను స్వయంగా పెంచి, వాళ్లకు మంచి భవిష్యత్తును అందించారు. పర్యావరణాన్ని రక్షించేందుకు, మూగజీవాల సంక్షేమానికి తన వంతు సహాయం చేయాలని భావించి ఓ ఎన్జీవో స్థాపించారు. సమాజానికి ఉపయోగపడే మార్గాలను ఎప్పుడూ అన్వేషిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తుంటారు.
ఆమె భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతో ప్రేమిస్తారు. ప్రతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పిల్లలు మన సంప్రదాయాలను కొనసాగించాలని కోరుతూ, చిన్నతనం నుంచి వారికి వాటి ప్రాముఖ్యతను అర్థమయ్యేలా చేస్తారు. పిల్లలకు మన సంప్రదాయ దుస్తులను అలవాటు చేయాలని, మగపిల్లలు ధోతీ ధరించాలని సూచించారు. ప్యాంట్స్ మన సంస్కృతికి చెందినవి కావని, మన సంప్రదాయ దుస్తులను గౌరవించాలంటూ యువతకు సందేశం ఇచ్చారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విశేషాలను కూడా పంచుకుంటారు. దేశంలో జరుగుతున్న వివిధ అంశాలపై తన అభిప్రాయాలను ఓపెన్‌గా వెల్లడించడం ఆమెకు అలవాటు. తన జీవితంలో జరిగిన మార్పులను, అనుభవాలను పంచుకోవడంలో ఎలాంటి వెనుకంజ వేయరు. ఆమె పవన్ కళ్యాణ్‌తో తన వైవాహిక జీవితం, విడాకులు, పిల్లల పెంపకం వంటి విషయాల్లో ఎప్పుడూ ఓపెన్‌గా స్పందిస్తారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాపులారిటీ కోసం ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత జీవితాలపై దురుసుగా మాట్లాడుతున్న వారిపై ఆమె మండిపడ్డారు. తాజాగా బాలీవుడ్‌లో ఫేమస్ అయిన ‘ఇండియా గాట్ టాలెంట్’ షోలో రణ్‌వీర్ అల్లాబాడియా అనే యూట్యూబర్, సమయ్ రైనా, అపూర్వ ముఖిజలు హాజరయ్యారు. షోలో ఓ లేడీ కంటెస్టెంట్‌తో పాటు, ఆమె తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలపై అనుచితంగా మాట్లాడాడు. ఈ ఘటన అక్కడే ఉన్నవారిని షాక్‌కు గురిచేసింది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రేణూ దేశాయ్ దీనిపై ఘాటుగా స్పందించారు. పిల్లలను బాధ్యతగా పెంచాలని, రణ్‌వీర్ లాంటి వ్యక్తులను దూరంగా పెట్టాలని సూచించారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే హక్కును దుర్వినియోగం చేయొద్దని, యువత సమాజాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లేలా కృషి చేయాలని హితవు పలికారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, రణ్‌వీర్ తన మాటలకు క్షమాపణలు చెప్పారు. అయితే, ఇప్పట్లో ఈ వివాదం సద్దుమణిగే అవకాశాలు కనబడటం లేదు.